SC On Bulldozer Action : కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వివాదాస్పదమైన 'ఆపరేషన్ బుల్డోజర్'పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేయగలరని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై జాతీయస్థాయిలో కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తామని పేర్కొంది. బుల్డోజర్ జస్టిస్ పేరుతో దాఖలైన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
'ఓ వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉంటే అతడి ఇల్లు ఎలా కూల్చివేస్తారు? ఒక వేళ ఆ వ్యక్తి దోషిగా తేలినా సరే, చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా కూల్చివేయకూడదు. అక్రమ కట్టడాలను మేము రక్షించడం లేదు. చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటాం. అయితే, ఈ కూల్చివేతలకు సంబంధించి జాతీయ స్థాయిలో మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై ఇరు పక్షాలు తమ సూచనలు తెలియజేయొచ్చు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం' అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ కేసుల నిందితులకు సంబంధించిన భవనాలను బుల్డోజర్లతో కూల్చేయడం కొంతకాలంగా చర్చనీయాంశమైంది. గతేడాది హరియాణాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఘర్షణల అనంతరం అక్రమ నిర్మాణాలపై స్థానిక అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలు అక్రమమంటూ బుల్డోజర్లతో కూల్చివేసింది. ఘర్షణల సమయంలో దుండగులు అక్కడి నుంచే రాళ్లు విసిరారని జిల్లా యంత్రాంగం తెలిపింది. అది అక్రమంగా నిర్మించారని పేర్కొంది.
'రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ - వారంలోగా తొలి సమావేశం'
మరోవైపు హరియాణాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు సుప్రీం కోర్టు సోమవారం తెలిపింది. ఆ కమిటీకి పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ నేతృత్వం వహిస్తారని పేర్కొంది. వారంలోగా రైతులతో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారితో చర్చలు జరపాలని కమిటీని ఆదేశించింది.