SBI Electoral Bonds Supreme Court : రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ పేర్లు ఈసీకి సమర్పించినట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగా ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందించినట్లు ఎస్‌బీఐ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం అందజేసింది. తాజాగా దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి ఎస్‌బీఐ అఫిడవిట్ సమర్పించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 మధ్య కొనుగోలు చేసిన, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన డేటాను ఈసీకి అందించినట్లు తెలిపింది.
"కోర్టు ఆదేశాల మేరకు గత ఐదేళ్లలో మేం జారీ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 12న ఈసీకి ఇచ్చాం. ఈ బాండ్లను ఎవరెవరు ఎంత కొనుగోలు చేశారు? ఏ పార్టీలు ఎంత ఎన్‌క్యాష్ చేసుకున్నాయి? వంటి వాటిని అందించాం" అని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ అఫిడవిట్ సమర్పించారు. గత నెల ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.
2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు మొత్తం 22,217 ఎన్నికల బాండ్లను దాతలు కొనుగోలు చేసినట్లు ఎస్‌బీఐ తమ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో 22,030 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసుకుని నిధులు తీసుకున్నట్లు తెలిపింది. మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రిడీమ్ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డబ్బు జమ చేసినట్లు వెల్లడించింది.
అయితే వీటితో ఏ పార్టీకి ఎన్ని నిధులు దక్కాయన్నదానిపై ప్రస్తుతానికి పూర్తి స్పష్టత లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఈ నెల 15 సాయంత్రం ఐదు గంటల్లోగా ఈసీ ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో బహిరంగపరచాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో ఎస్‌బీఐ వీటిని విక్రయించింది.
వ్యక్తులు/సంస్థలు వీటిని కొనుగోలు చేసి అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధుల కింద అందించాయి. నిబంధనల ప్రకారం జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి. ఆలోగా రాజకీయ పార్టీలు వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత మిగిలిపోయిన బాండ్లకు చెందిన నగదును పీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేస్తారు.