Salman Khans House Firing Case : ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసులో ముంబయి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఘటనకు సంబంధించి సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు ఆర్బాజ్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తు నిమిత్తం జూన్ 4న క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నలుగురు సభ్యుల బృందం సల్మాన్ నివాసానికి వెళ్లినట్లు ఓ అధికారి తెలిపారు. సల్మాన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ ఖాన్ నుంచి పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. సల్మాన్ వాంగ్మూలం తీసుకోవడానికి నాలుగు గంటలు, ఆయన సోదరుడి స్టేట్‌మెంట్‌కు 2 గంటలకుపైగా పట్టినట్లు ఆ అధికారి తెలిపారు. వీరిద్దరినీ కలిపి 150కి పైగా ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు.
'ఘటన జరిగిన రోజు (ఏప్రిల్ 14) నేను ఇంట్లోనే ఉన్నా. ముందు రోజు రాత్రి పార్టీ వల్ల ఆలస్యం కావడం వల్ల ఆలస్యంగా పడుకున్నా. తెల్లవారుజామున నా ఇంటి బాల్కనీ వద్ద తుపాకీ పేలిన శబ్దాలు వినిపించడం వల్ల వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచా. బాల్కనీకి వెళ్లి చూడగా బయట ఎవరూ కన్పించలేదు' అని సల్మాన్ వాంగ్మూలంలో వెల్లడించారు. ఇక, ఘటన జరిగిన రోజు జుహూలోని తన నివాసంలో ఉన్నట్లు నటుడి సోదరుడు అర్బాజ్ ఖాన్ పోలీసులకు చెప్పారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు గతంలోనూ బెదిరింపులు వచ్చాయని తెలిపారు.
అసలేం జరిగిదంటే
ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఇది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకడు ఇటీవల పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నారు.
వర్షాకాల సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్- నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్! - parliament session