RSS On BJP Lok Sabha Results : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయని ఆర్‌ఎస్‌ఎస్ వ్యాఖ్యానించింది. నేతలంతా గాలి బుడగను నమ్ముకుని పని చేశారని తెలిపింది. అంతా మోదీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో పని చేయడంవల్ల లక్ష్యాలు సాధ్యమవుతాయి గానీ సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీల ద్వారా కావని పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో తాజా సంచికలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఓ వ్యాసం ప్రచురితమైంది.
నమ్మకంతో వారు పని చేయలేదు!
"ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర స్థాయి పోరాట బలగం కాకపోయినప్పటికీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సంఘ్ స్వయం సేవకుల సహకారం తీసుకోలేదు. అంకిత భావంతో పని చేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు. వారికి బదులుగా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న వారికి ప్రాధాన్యమిచ్చారు. స్వీయ ప్రకటిత కార్యకర్తలను నమ్ముకోవడంవల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 400కుపైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు, కార్యకర్తలు భావించారు. ఆయనవల్లే గెలుస్తామనే నమ్మకంతో వారు పని చేయలేదు" అని తాను రాసిన వ్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శార్దా వ్యాఖ్యానించారు.
"543 నియోజకవర్గాల్లో మోదీ పోటీ చేస్తున్నారన్న ప్రచారానికి కొంతే విలువ ఉంటుంది. ఇటువంటి ఆలోచన స్వీయ పరాజయానికి దారి తీస్తుంది. స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం, బాగా పని చేసిన పార్లమెంటు సభ్యులకు టికెట్లు ఇవ్వకపోవడం వికటించింది. టికెట్లు ఇచ్చిన వారిలో 25శాతం మంది వలస నేతలే. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇలాగే 30 శాతం టికెట్లను ఫిరాయింపుదారులకు ఇవ్వడం వల్ల పార్టీ ఓటమి పాలైంది. స్థానిక అంశాలు, అభ్యర్థి గుణగణాలు ఎన్నికల్లో ముఖ్యం. ఇటువంటి అంశాల వల్ల స్థానిక కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగి ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు"
- రతన్ శార్దా, ఆర్‌ఎస్‌ఎస్ జీవితకాల సభ్యుడు
కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం వల్లే!
"అనవసర రాజకీయం కూడా పార్టీని దెబ్బతీసింది. మహారాష్ట్ర ఇందుకు ఉదాహరణ. అక్కడ పార్టీలను చీల్చడం అనవసరం. బీజేపీ, శివసేనలకు అసెంబ్లీలో బలం ఉన్నా అజిత్ పవార్‌ను చేర్చుకోవడం తప్పిదమే. ఎన్సీపీలో అంతర్గత కలహాలవల్ల శరద్ పవార్ ఎలాగూ రెండు మూడేళ్లలో కనుమరుగయ్యేవారు. కానీ అజిత్‌ను చేర్చుకోవడంతో బీజేపీ కార్యకర్తలు మనస్తాపం చెందారు. ఒక్క దెబ్బతో మహారాష్ట్రలో బీజేపీ అన్ని పార్టీల్లాగే మారిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న కోట కూలిపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బ తీసింది" అని శార్దా వివరించారు.