Rajasthan Accident Today : రాజస్థాన్ సవాయ్ మాధోపుర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల దిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ వేపై ఉన్న బనాస్ నది వంతెన సమీపంలో ఆదివారం ఉదయం జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బోన్లీ ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ కారులో సవాయి మాధోపుర్ లోని గణేశ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
గణేశ్ దర్శనం కోసం సికార్ నుంచి రణథంబోర్కు కారులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది వెళ్తున్నారు. ఇంతలో ఆ కారును బనాస్ నది వంతెన సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్ల ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు చిన్నారులు గాయపడగా, వారిని బౌన్లీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారులో నుంచి ఆరు మృతదేహాలను పోలీసులు బయటకు తీసి మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చాక మృతదేహాలను శవపరీక్షలు నిర్వహించి అప్పగిస్తారు.
"మనీష్ శర్మ, అతడి భార్య అనిత, కైలాష్ శర్మ, సంతోషీ, సతీష్ శర్మ, పూనమ్ కారు ప్రమాదంలో మృతి చెందారు. మనన్, దీపాలీ అనే ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. నుజ్జు నుజ్జైన కారులో నుంచి అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశాం. ప్రమాదస్థలి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. కారును ఢీకొట్టిన వాహన డ్రైవర్ను పట్టుకునేందుకు గాలిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు-ఒకరు దుర్మరణం
వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ కారు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. రాజస్థాన్ సికర్ జిల్లాలోని ఫతేపుర్ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ కారులో దైవ దర్శనానికి వెళ్తుడంగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సికర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.