Railway Station Master Sleeps On Duty : విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో సిగ్నల్ లేక ఓ ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు అరగంటపాటు నిలిచిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటావా సమీపంలోని ఉడిమోర్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పట్నా- కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ రైలు మే 3న ఉడిమోర్ జంక్షన్‌కు చేరుకుంది. అయితే అప్పటికే అక్కడున్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు గ్రీన్ సిగ్నల్ లేకపోవడం వల్ల రైలును లోకోపైలట్ అక్కడే నిలిపేశాడు. స్టేషన్ మాస్టర్‌ను మేల్కొలిపేందుకు లోకోపైలట్ అనేక సార్లు హారన్ కొట్టినట్లు సమాచారం.
అయితే అప్పటికే రైలు అక్కడ దాదాపు అరగంటపాటు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు స్టేషన్ మాస్టర్ నుంచి వివరణ కోరారు. అనంతరం తగు క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు సమాచారం. తనతోపాటు డ్యూటీలో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీకి వెళ్లడం వల్ల, తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నట్లు స్టేషన్ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది.
డ్రైవర్ లేకుండా రైలు పరుగులు
ఫిబ్రవరిలో ఇలాంటి ఓ ఘటన జరిగింది. రైల్వే నిర్మాణ సామాగ్రిని తరలించే గూడ్సు రైలు జమ్ముకశ్మీర్‌లోని కథువా నుంచి ఉచ్చిబస్సు స్టేషన్ వరకు దాదాపు 75 కిలోమీటర్లు లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ లేకుండా ప్రయాణించింది. ఒకానొక సమయంలో రైలు వేగం గంటకు 100 కిలోమీటర్లు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇంజిన్ ప్రారంభం కాకుండా కేవలం జారుడుగా ఉన్న పట్టాలపై రైలు ముందుకు కదులుతూ వెళ్లింది. మార్గమధ్యలో 8 నుంచి 9 స్టేషన్‌లను రైలు దాటింది. అదృష్టవశాత్తూ ఎదురుగా వేరే రైళ్లు రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. చివరకు ఉచ్చిబస్సు స్టేషన్‌వద్ద రైల్వే అధికారులు ఇసుకబస్తాలు అడ్డుపెట్టి రైలును ఆపగలిగారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి- వారికోసం సైన్యం భారీ ఆపరేషన్! - Terrorist Attack On Indian Army
సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ- ముందస్తు బెయిల్ పిటిషిన్ కొట్టేసిన కోర్టు - hasan sex scandal