Rahul Gandhi Modi Debate : లోక్‌సభ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ అంశంపై ఇద్దరు నేతల మధ్య బహిరంగ చర్చ జరగాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ బి.లోకూర్, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ అజయ్ పి.షా, ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్‌లు రాసిన లేఖపై ఆయన స్పందించారు. లోక్‌సభ ఎన్నికల వేళ విశ్రాంత న్యాయమూర్తుల చొరవను ప్రశంసిస్తూ, ప్రధాని మోదీ కూడా ఇందులో భాగమవుతారని ఆశిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
'బహిరంగ చర్చకు సంబంధించి అందిన ఆహ్వానంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడాను. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ఒకే వేదికపై నుంచి ప్రధాన పార్టీలు తమ దార్శనికతను దేశం ముందు ఉంచడం మంచి ప్రయత్నం అవుతుంది. దీంతో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలపై మోపిన నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా ఇది కీలకంగా మారుతుంది. నేను లేదా పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఈ ఉపయోగకరమైన, చరిత్రాత్మక చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అ సమయం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రధానమంత్రికి స్పందన తెలియజేయండి' అని రాహుల్ ఎక్స్ వేదికగా ప్రతిస్పందన లేఖ విడుదల చేశారు.
వాణిజ్య ప్రయోజనాలకు దూరంగా, పక్షపాత రహితమైన వేదిక మీద ఈ చర్చ జరగాలని అంతకుముందు రాసిన లేఖలో ఆ ముగ్గురు ప్రముఖులు కోరారు. ఇలాంటి చర్చ ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, ఆరోగ్యకరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్య వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. ఒకవేళ ఈ ఇద్దరు నేతలకు బహిరంగ చర్చలో పాల్గొనేందుకు వీలుపడకపోతే తమ తరఫున ప్రతినిధులను పంపాలని లేఖలో కోరారు.
రాహుల్‌కు ఉన్న పరిజ్ఞానం ఏమిటి?
అయితే, దేశంలోని ప్రధాన సమస్యలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనన్న విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తోసిపుచ్చింది. వివిధ అంశాలపై రాహుల్‌కు ఉన్న పరిజ్ఞానం ఏమిటంటూ ప్రశ్నించింది. ఏ హోదాలో చర్చకు వస్తారని నిలదీసింది. 'ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు కాదు, విపక్ష నేత కూడా కాదు' అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తోందన్న రాహుల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. అమేఠీలో పోటీ చేయలేని వ్యక్తి ప్రభుత్వ ఏర్పాటు గురించి మాట్లాడటమా అంటూ పరిహసించారు.
'గవర్నర్ను వీధుల్లోనే కలుస్తా- ఆయన పక్కన కూర్చోవడం పాపమే' - west bengal governor issue