Puri Srimandir Ratna Bhandar : నలభై ఆరు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్నభాండాగారం రహస్య గది తెరుచుకోనుంది. దీన్ని ఈ నెల 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కింపు సహా భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు. డుప్లికేట్ తాళం పని చేయకపోతే, తాళాన్ని పగులగొట్టి రత్నభాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు.
46 ఏళ్ల తర్వాత
ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్నభాండాగారం రహస్య గది జులై 14వ తేదీన తెరుచుకోనుంది. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పటి నుంచి మూసి ఉన్న రహస్యగదిని మళ్లీ జులై 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పూరీలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
జులై 14వ తేదీలోగా రత్నభాండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాన్ని, కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళం పని చేయకపోతే, తాళాన్ని పగులగొట్టి రత్నభాండాగారం ఉన్న రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తెరిపించి స్వామి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రత్నభాండాగారం రహస్య గది తాళం చెవి ఇది వరకు కనిపించకుండాపోయిన నేపథ్యంలో డూప్లికేట్ తాళంచెవి పూరీ కలెక్టరేట్‌లోని ఖజానాలో ఉందని శ్రీక్షేత్ర పాలనాధికారి చెప్పారు.
దశాబ్దాలుగా రహస్యగదిలో నిక్షిప్తమై ఉన్న ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, గోమేధిక, పుష్యరాగాల బరువు, నాణ్యత తమ సంఘం అంచనా వేయలేదని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఈ సంపద పరిశీలించడానికి నిపుణుల అవసరం ఉన్నందున మరో సంఘం నియమించడానికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. సంఘం ఏర్పాటు చేసే బాధ్యత శ్రీక్షేత్ర పాలకవర్గంపైనే ఉంటుందన్నారు.

పటిష్ఠ భద్రత మధ్య సంపద లెక్కింపు!
రథయాత్ర సమయంలోనే భాండాగారం తెరిపిస్తామన్న జస్టిస్ రథ్ సంపద లెక్కింపు, మరమ్మతులు ఒకేచోట సాధ్యం కాదన్నారు. ఆభరణాలు మరో చోటుకు తరలించి, సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యత పరిశీలన జరుగుతుందన్నారు. దీనికోసం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటిస్తామన్నారు. గట్టి భద్రత మధ్య భాండాగారం వెలుపల లెక్కింపు, మరోవైపు భాండాగారం మరమ్మతులు జరుగుతాయన్నారు. దీనికి ఎంత వ్యవధి పడుతుందన్నదీ కచ్చితంగా చెప్పలేమన్నారు. 1978లో జరిగిన లెక్కింపునకు 70 రోజుల వ్యవధి పట్టిందన్నారు. ప్రస్తుతం ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున ఈ పనులు త్వరగా జరుగుతాయన్న అంచనా ఉందన్నారు. దీనివల్ల జగన్నాథుని సేవలు, భక్తులు దర్శనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు జరుగుతాయన్నారు.

ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రత్నభాండాగారం ఉన్న రహస్య గది అంశం రాజకీయంగా ప్రధాన అంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే రత్నభాండాగారం ఉన్న రహస్య గదిని తెరుస్తామని అప్పట్లో భాజపా హామీ ఇచ్చింది. ఆభరణాల లెక్కింపు, రత్నభాండాగారం మరమ్మత్తులు చేయిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రథయాత్ర జరుగుతున్న సమయంలోనే రత్నభాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయం తీసుకున్నారు.

అంగరంగవైభవంగా పూరీ జగన్నాథుడి రథయాత్ర- ఆ నీలమాధవుడి ఆలయ చరిత్ర మీకోసం! - Puri Rath Yatra 2024
ఏటా కొత్త రథం- 12రోజుల పాటు ఉత్సవాలు- పూరీ జగన్నాథుడి రథయాత్ర విశేషాలివే! - Puri Rath Yatra 2024