Priyanka Gandhi Lok Sabha Election : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్ గాంధీ ఖాళీ చేయనున్న కేరళలోని వయనాడ్ స్థానం నుంచి ఆమె లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 18వ లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన రాహుల్, ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోనే కొనసాగనున్నారు. ఆ స్థానం నుంచి ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాహుల్ సీటుపై సోమవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. 1997లో రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019 జనవరి 23న ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి వరకు ఆమె పరోక్షంగా కుటుంబ సభ్యులకు ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ, అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టడం అదే మొదటి సారి. తొలుత తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌కు పూర్తి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఆమె విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా నిరంతరం యూపీలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ వచ్చారు. దాని ఫలితంగానే తాజా ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీఏ కంటే అధిక సీట్లు సాధించింది.
ముగ్గురు గాంధీలు ఒకేసారి పార్లమెంట్‌కు!
వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికైతే తొలిసారిగా పార్లమెంటులోకి ఆమె అడుగుపెడతారు. అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని మూడో వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇదివరకు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిస్తే ముగ్గురు గాంధీలు ఒకే సమయంలో పార్లమెంటులో ఉన్నట్లవుతుంది.
ప్రియాంక రాకను స్వాగతించిన సీపీఐ
వయనాడ్ నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం స్వాగతించింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ మహిళను పోటీలో నిలబెట్టాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందని సీపీఐ నేత అన్నీ రాజా స్వాగతించారు.
'కాంగ్రెస్ ఒక కుటుంబ కంపెనీ'
మరోవైపు కాంగ్రెస్ ఒక పార్టీ కాదని, అది ఒక కుటుంబ కంపెనీ అని బీజేపీ వ్యాఖ్యానించింది. వారసత్వ రాజకీయాలను ఇది రుజువని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూన్వాలా విమర్శించారు. తల్లి రాజ్యసభలో, కొడుకు లోక్‌సభలో, ప్రియాంక కూడా మరొ లోక్‌సభ స్థానంలో ఉంటారు. ఇది వారసత్వ రాజకీయాలకు చిహ్నం' అని అన్నారు.