Sikkim CM Swearing in Ceremony : ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పల్జోర్ స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. తమాంగ్తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. సుమారు 30వేల మంది ప్రజల మధ్య వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో సోమవారం రాజధాని గ్యాంగ్టక్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సగం రోజు సెలవు ఇచ్చారు.
ప్రేమ్ సింగ్ తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలను SKM గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 25 ఏళ్ల పాటు సిక్కింను పాలించిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒక్క సీటుకే పరిమితమై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు.
అసలెవరీ తమాంగ్?
తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. బంగాల్‌లోని దార్జీలింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1990లో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల తర్వాత ఉద్యోగం మానేసి రాజకీయాలవైపు మళ్లారు. 1994లో పవన్ చామ్లింగ్‌తో కలిసి ఎస్‌డీఎఫ్‌ను స్థాపించారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2009 ఎన్నికల తర్వాత తమాంగ్‌కు పార్టీతో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలుపొందినా, పవన్ చామ్లింగ్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. తన రాజకీయ గురువైన చామ్లింగ్ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపిస్తూ, ఆయనపై తిరుగుబావుటా ఎగురవేశారు. 2013లో సొంతంగా ఎస్‌కేఎంను స్థాపించారు.
తొలి ప్రయత్నంలో 10 సీట్లు
2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎస్‌కేఎం 10 స్థానాలు దక్కించుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే 1994-1999 మధ్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రూ.10 లక్షల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారన్న అభియోగంతో నమోదైన కేసులో తమాంగ్‌కు ఏడాది జైలుశిక్ష పడింది. 2018లో జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీకి పట్టం కట్టారు. 17 స్థానాలు గెల్చుకొని ఎస్‌కేఎం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. తమాంగ్ సీఎం పీఠమెక్కారు. గత ఐదేళ్లలో తమాంగ్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.