Deve Gowda On Prajwal Revanna Scandal : లైంగిక దౌర్జన్యం కేసులో తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దంటూ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోరారు. తన మనవడు, హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారంలో తొలిసారి స్పందించిన దేవెగౌడ, ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టకూడదంటూ వ్యాఖ్యానించారు.
"ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు. చట్టప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికే హెచ్‌డీ కుమారస్వామి చెప్పాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు చెప్పను కానీ వారిపై కూడా చర్యలు ఉండాలి" అని దేవెగౌడ అన్నారు. ఇదిలా ఉంటే ప్రజ్వల్‌తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కుమారస్వామి చెప్పారు. కర్ణాటకలో ఉన్న సమయంలో కూడా టచ్‌లో లేనన్నారు. అతడి వెంట పరిగెత్తాలా ఏంటి? అని ప్రశ్నించారు.
మరోవైపు కిడ్నాప్ కేసులో అరెస్టైన కర్ణాటక మాజీ మంత్రి, ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది. తనయుడి లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను అపహరించిన కేసులో మే 4న ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.
'వాళ్ల పరువు తీస్తే వందకోట్లు ఇస్తానన్నారు'
ప్రధాని మోదీ, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి పరువుతీసే వ్యాఖ్యలు చేస్తే తనకు వంద కోట్లు ఇస్తానని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆఫర్ చేశారని బీజేపీ నేత, న్యాయవాది దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా అంతం చేయాలన్నదే డీకే లక్ష్యమని, అందుకోసం తనను సంప్రదించారని ఆయన వివరించారు. డీకే అవినీతిని బహిర్గతం చేసేందుకు సిద్ధమన్న దేవరాజే గౌడ, కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోతుందని తెలిపారు.
తనకు రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా పంపారని కూడా ఆరోపించారు. డీకే ఆఫర్‌ను తిరస్కరించినందుకు అక్రమ కేసులు బనాయించి తనను జైల్లో పెట్టారని ఆరోపించారు. మొదట అట్రాసిటీ కేసు నమోదు చేశారని సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్ల దాన్ని లైంగిక వేధింపుల కేసుగా మార్చారని దేవరాజేగౌడ ఆరోపణలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలను ప్రసారం చేసింది కుమారస్వామేనని చెప్పమన్నారని, అందుకు తాను తిరస్కరించినట్లు చెప్పారు. అశ్లీల వీడియోల వెనక పెద్దకుట్ర జరిగిందన్న ఆయన, అందుకు డీకే శివకుమార్ పథకరచన చేశారని ఆరోపించారు. డీకేతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌లు తన వద్ద ఉన్నాయంటూ దేవరాజే గౌడ వెల్లడించారు.
ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్- మహిళను బెదిరించి ఫిర్యాదు చేయించారట! - Prajwal Revanna Issue