Prajwal Revanna Sex Scandal : కర్ణాటకలోని ప్రధానపార్టీలకు సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన వేళ మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకుడు దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. మహిళలపై ఆయన లైంగికదాడికి పాల్పడుతున్న వీడియో క్లిప్పింగ్స్ హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి.
అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ నాగలక్ష్మీ చౌధరీ రాసిన లేఖకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఈనెల 26న పోలింగ్ జరిగింది.
అసభ్య వీడియో క్లిప్పింగ్‌లపై దుమారం రేగటం వల్ల జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లిపోయారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లినట్లు సమాచారం. అసభ్య వీడియోలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజ్వల్ రేవణ్ణ పేరు చెడగొట్టడానికి నవీన్ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్‌లను వైరల్ చేశారని జేడీఎస్-బీజేపీ ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఆరోపించారు. మార్ఫింగ్ వీడియోలను హసన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్లకు పంపించినట్లు చెప్పారు. అంతేకాదు రేవణ్ణకు ఓటేయొద్దని కోరినట్లు పూర్ణచంద్రగౌడ చెప్పారు.
హసన్ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోటగా పేరొందింది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై దేవెగౌడ కుటుంబానిదే పైచేయిగా ఉంది. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ దేవెగౌడ పెద్దకుమారుడు హెచ్‌డీ రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్‌జీ అనుపమకూ ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయగా 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇరు కుటుంబాలకు చెందినవారే మళ్లీ పోటీపడ్డారు.
తప్పు ఎవరు చేసినా చట్టం ప్రకారం చర్యలు : హెచ్‌డీ కుమారస్వామి
ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. నేరాలకు పాల్పడిన వారు చట్టం ప్రకారం చర్యలకు అర్హులను చెప్పారు. 'విచారణ ద్వారా అన్ని నిజాలు బయటకు రావాలి. తప్పు ఎవరికి అయినా, కారణం ఏదైనా క్షమించే ప్రశ్నే లేదు. అందులో ఈ విషయంపై దర్యాప్తు నివేదిక బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను. నేను, దేవెగౌడ మహిళలను గౌరవిస్తాం. వారి ఫిర్యాదులతో మా వద్దకు వచ్చినప్పుడు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశాం. ముఖ్యమంత్రి సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. ఆయనను (ప్రజ్వల్ రేవణ్ణ) సిట్ బృందం విదేశాల నుంచి తీసుకువస్తుంది. అది సమస్య కాదు. ఎవరు తప్పు చేసినా ఈ దేశంలోని చట్టం ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని అన్నారు.