PM Modi Meditation In Kanniyakumari : 131ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల సుదీర్ఘ ధ్యాన ప్రక్రియ చేపట్టారు. గురువారం రాత్రి మొదలైన ఈ ధ్యానం శనివారం సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారు. ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్న దృశ్యాలను భారతీయ జనతా పార్టీ ఎక్స్ ద్వారా ప్రజలతో షేర్ చేసుకుంది.
ధ్యాన ప్రక్రియలో భాగంగా శుక్రవారం సూర్యోదయాన సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించారు. అనంతరం సూర్యనమస్కారం చేశారు. వివేకానంద స్మారక ప్రాంగణంలో ప్రధాని మోదీ కలియతిరిగారు. చేతిలో జపమాల పట్టుకుని జపం చేసుకుంటూ అడుగులు వేశారు.
ఆ తర్వాత మళ్లీ ధ్యాన మండపంలో కూర్చుని ధ్యానంలో నిమగ్నమయ్యారు. కాషాయ చొక్కా, శాలువా, ధోతీ ధరించి మెడిటేషన్ చేస్తున్నప్రధాని మోదీ చిత్రాలను బీజేపీ పోస్టు చేసింది. ఆ ఫొటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు
మెడిటేషన్ సమయంలో ప్రధాని మోదీ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గురువారం రాత్రి నుంచి ప్రారంభించిన ధ్యానం జూన్ ఒకటో తేదీ సాయంత్రం ముగుస్తుంది. అప్పటివరకు కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే తీసుకుంటారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన ప్రధాని మోదీ గురువారం తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక ధ్యానం చేపట్టారు.
2014, 2019లో అక్కడ!
ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆధ్యాత్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టటం 2014 నుంచి మొదలైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండునెలలు ఊపిరిసలపని షెడ్యూల్‌తో అలసిపోయిన ఆయన ధ్యానం చేయటం ద్వారా ఉపశమనం పొందుతుంటారు. 2014 ఎన్నికల అనంతరం తొలిసారి శివాజీకి చెందిన ప్రతాప్‌గఢ్ కోటలో గడిపారు. 2019 ఎన్నికల తర్వాత కేదార్‌నాథ్ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు. ఇప్పుడు కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానం చేపట్టారు.