PM Modi Bronze Statue In Assam : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న ప్రేమను విభిన్నంగా చాటిచెప్పేందుకు పూనుకున్నారు అసోంకు చెందిన ఓ వ్యాపారవేత్త. ఆయనకోసం ఏకంగా 190 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అయ్యే రూ.200 కోట్ల ఖర్చును తన సొంత సంపాదన నుంచి వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గువాహాటి నగరం జలుక్‌బారిలోని ప్రధాన బస్టాండ్ సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో విగ్రహా ఏర్పాటు కోసం భూమి పూజను జరిపించారు వ్యాపారవేత్త నవీన్ చంద్ర బోరా. సోమవారం ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగనుందని చెప్పారు. ఇందుకోసం భారీగానే ఏర్పాట్లు చేశారు.
'అలా వచ్చిందీ ఆలోచన'
గువాహాటి చెందిన నవీన్ చంద్ర బోరా అనే వ్యాపారవేత్తకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఎంతో అభిమానం. 2016లో ఆయన చేతుల మీదుగా ఓ విషయంలో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు బోరా. దీంతో అప్పుడే ప్రధాని కోసం ఓ భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని అనుకున్నారట. అందులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ భారీ కాంస్య విగ్రహ ఏర్పాటు అని చెప్పారు.
మోదీ మెడపై అస్సామీ డిజైన్!
'నా సొంత డబ్బులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దీనిని నా సొంత స్థలంలోనే నెలకొల్పనున్నాను. ఇందుకోసం దాదాపు రూ.200 కోట్లను జమ చేశాను. 190 అడుగుల మోదీ కాంస్య విగ్రహ తయారీ కోసం 60 అడుగుల పునాదినీ తీయించాను. మొత్తంగా పునాదితో కలుపుకొని విగ్రహం ఎత్తు 250 అడుగులు' ఉంటుంది అని వ్యాపారవేత్త నవీన్ చంద్ర బోరా ఈటీవీ భారత్‌తో తెలిపారు. ఇక విగ్రహానికి సంబంధించి ఇప్పటికే తుది డిజైన్ ప్లాన్‌ను కూడా రూపొందించినట్లు ఆయన చెప్పారు. అయితే ఇంత భారీ విగ్రహం మెడపై అసోం సంస్కృతికి చిహ్నంగా నిలిచే గమోసా డిజైన్‌ను చూపించబోతున్నట్లు బోరా వివరించారు.
విగ్రహం ఏర్పాటుపై పీఎంఓకు లేఖ
మోదీ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ గతేడాది ప్రధాని కార్యాలయానికి లేఖ కూడా పంపినట్లు తెలిపారు నవీన్ చంద్ర బోరా. ఇందులో విగ్రహం కోసం ఖర్చు చేయనున్న రూ.200 కోట్ల రూపాయలు ఏ ఆదాయ మార్గాల ద్వారా సంపాదించానో కూడా తెలిపానని చెప్పారు.
"ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నా. ఆయనపై నాకున్న ప్రేమతోనే ఇది చేస్తున్నాను. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రధానులలో నరేంద్ర మోదీ ఒకరు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేను ఎంతో అదృష్టవంతుడ్ని"
- నవీన్ చంద్ర బోరా, వ్యాపారవేత్త
అవినీతిలో భారత్ 93వ స్థానం- ఆ దేశమే టాప్
అయోధ్య రామయ్య ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలుసా? వీటిని ఎవరు చేశారు?