Phone Unlock With Breath : సాధారణంగా వేలిముద్రలు, ఐరిస్ ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పటికే అనేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. అలా వాటితో ఫింగర్ ప్రింట్, ఐరిస్ ద్వారా ఫోన్ అన్ లాక్ చేస్తున్నాం. రేషన్ షాపుల నుంచి బ్యాంకుల వరకు భద్రత కోసం ఆ టెక్నాలజీలనే ఉపయోగిస్తున్నాం. అయితే ఇప్పుడు ఫింగర్ ప్రింట్, ఐరిస్తోపాటు శ్వాస తోనే వాటిని అన్‌లాక్ చేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు మద్రాస్ ఐఐటీ విద్యార్థి ముకేశ్.
ఈ బ్రీతింగ్ టెక్నాలజీని ప్రాక్టికల్ అప్లికేషన్లుగా అభివృద్ధి చేశాక, సెల్‌ఫోన్ అన్‌లాక్‌తోపాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చని మద్రాస్ ఐఐటీ విద్యార్థి ముకేశ్ చెప్పారు. ఈ టెక్నాలజీ వైద్యరంగంలోనూ ఎంతో ఉపయోగపడుతందని తెలిపారు. మద్రాస్ ఐఐటీలో అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు ముకేశ్.
"ఒక వ్యక్తి శ్వాస వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. ప్రతి మనిషికి ఆ శ్వాసకోశంలో తేడా ఉంటుంది. దీంతో గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ వేగం హెచ్చుతగ్గుల నమూనాలలో తేడాల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా మేం చూపించాం. ఇందులో మనిషిని గుర్తించేందుకు రెండు వేర్వేరు పరీక్షలు చేశాం. ఒకటి యూజర్ కన్ఫర్మేషన్ టెస్ట్. ఉదాహరణకు ఈ టెస్ట్‌లో ఒక వ్యక్తి "నేను మహేశ్" అని చెబితే, సాఫ్ట్‌వేర్ అవును అతడు మహేశ్ అని నిర్ధరిస్తుంది. ఈ పరీక్షలో 97 శాతం విజయం సాధించాం. మరొక మార్గం ఏమిటంటే, వారి పేరు చెప్పకుండా వారు ఎవరో కనుగొనడం. అందులో 50% విజయం సాధించాం" అని ఐఐటీ కార్పొరేట్ కమ్యూనికేషన్, అప్లైడ్ మెకానిక్స్ విభాగాధిపతి మహేశ్ పంజాక్నుల తెలిపారు.
"ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి మా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సాంకేతికత విషయానికొస్తే దానిని ఉపయోగించడానికి మానవుడు జీవించి ఉండటం అవసరం. కాబట్టి ఇది మనుగడకు రుజువుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇన్‌హేలేషన్ థెరపీ చేయవచ్చు. శ్వాసకోశ సమస్యల బారినపడ్డ వ్యక్తికి ఈ టెక్నాలజీ ద్వారా ఔషధం ఎంతో మోతాదును ఇవ్వాలో ముందే నిర్ణయించవచ్చు" అని మహేశ్ పంజాక్నుల తెలిపారు.