Patanjali Misleading Ads Case : ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. మీరు గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి విచారణకు కూడా రాందేవ్ బాబా, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. "ఆ సమయంలో మేము చేసింది తప్పిదమే. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. కోర్టు ఆదేశాలను అగౌరవపర్చాలన్నది మా ఉద్దేశం కాదు" అని అత్యున్నత ధర్మాసనానికి రాందేవ్ బాబా, బాలకృష్ణ తెలిపారు.
అయితే రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ వివరణపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. "గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియనంత అమాయకులేం కాదు మీరు. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదు అని మీకు తెలియదా? మీది బాధ్యతారాహిత్యం. మీరు చేసేది మంచి పనే. అయినా అలోపతీని తగ్గించి చూపించకూడదు. మీరు చెప్పిన క్షమాపణలను పరిశీలిస్తాం. అయితే ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టిట్లు కాదు. వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి" అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ కేసు
పతంజలి అలోపతి వైద్యవిధానాల గురించి తప్పుదోవ పట్టించేలా మీడియా ప్రకటనలు చేసిందని గతేడాది నవంబర్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడే ఆ సంస్థను మందలించింది. మళ్లీ అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. అయితే, ఆ హామీని ఉల్లంఘించడంపై ఫిబ్రవరిలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పతంజలి స్పందించకపోవడం వల్ల వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అందులో భాగంగానే స్వయంగా రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణ ఏప్రిల్ 2న హాజరయ్యారు. అప్పడు కూడా రామ్‌దేవ్ బాబా క్షమాపణలను అంగీకరించబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.