Paper Leak Act 2024 : దేశంలో పేపర్ లీకేజీ వివాదం ముదురుతున్న నేపథ్యంలో పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)'-2024 చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది శుక్రవారం(జూన్ 21) నుంచే అమల్లోకి వస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం నేరం చేసినట్లు రుజువైతే ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా ఉంటుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బిల్లును చట్టంగా చేశారు. ఎన్నికల కారణంగా అమలు తేదీని ప్రకటించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర సిబ్బంది, వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమనా విధించడానికి వీలుంది. గ్రూపులు, ముఠాలు, వ్యవస్థీకృత మాఫియాగా ఏర్పడి పేపల్ లీకేజీ వంటి అక్రమాల్లో పాల్పడే వారికి ఈ చట్టంలోని శిక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం పరీక్షలను నిర్వహించే సంస్థే, అక్రమాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి సంస్థలకు రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. నేరానికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తులు జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేస్తారు. అలాంటి సంస్థలను భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల నుంచి నాలుగేళ్లపాటు నిషేధిస్తారు. ఇక నుంచి పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేస్తారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)- యూపీఎస్సీలో సివిల్ సర్వీస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, కంబైన్డ్ మెడికల్ సర్వీస్, ఇంజినీరింగ్ సర్వీస్ వంటి తదితర పరీక్షలకు వర్తిస్తుంది.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC)- ఎస్ఎస్సీలోని గ్రూప్-సీ (నాన్ టెక్నికల్), గ్రూప్-బీ (నాన్ గెజిటెడ్) వంటి పోటీ పరీక్షలు ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB)- ఆర్ఆర్బీ నిర్వహించే గ్రూప్-సీ స్టాఫ్, గ్రూప్-డీ స్టాఫ్ వంటి తదితర పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) - వివిధ జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో అన్ని స్థాయిల ఉద్యోగాల కోసం ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలకు కొత్త చట్టం వర్తిస్తుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) - ఎన్టీఏ నిర్వహించే JEE (మెయిన్), NEET-UG, UGC-NET, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్- CUET మొదలైన పరీక్షలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
రాజ్యసభా పక్షనేతగా నడ్డా? 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే కొత్త అధ్యక్షుడు!