NEET UG 2024 Paper Leak CBI : దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నీట్ యూజీ లీకేజీ వ్యవహారంపై కేంద్రం ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. నీట్ యూజీ పరీక్ష లీకేజీపై పూర్తిస్థాయి విచారణ కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. 'అవకతవకలపై కొన్ని ఫిర్యాదులతోపాటు మోసం, మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి. సమగ్ర సమీక్ష తర్వాత దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం' అని విద్యాశాఖ పేర్కొంది. ఈ నిర్ణయానికి కంటే ముందు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌కు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీవో) ఛైర్మన్, ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించింది. అలాగే ఎన్టీఏ సంస్కరణల ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది.
ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియా
అయితే ఈ కేసులో ఇప్పటివరకు మధ్యవర్తులు, విద్యార్థులతో సహా 14 మందిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించినప్పుడు ఎక్కువగా సంజీవ్ ముఖియా పేరు వినిపించినట్లు తెలిపారు. దీంతో ఈ లీకేజీ వెనుక ప్రధాన సూత్రధారి అతడేనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నపత్రం మొదట అందింది సంజీవ్‌కేనని తెలుస్తోంది. అతడు ఓ ప్రొఫెసర్ ద్వారా పేపర్ తీసుకుని, రాకీ అనే వ్యక్తికి ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాదు పట్నాలోని ఓ బాయ్స్ హాస్టల్‌ను అద్దెకు తీసుకుని అందులో 25 మంది విద్యార్థులకు వసతి కల్పించాడని సమాచారం. వారందరికీ లీకైన పేపర్ ఇచ్చి ప్రిపేర్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మే 6 నుంచి సంజీవ్ కనిపించకుండా పోయాడని, అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పేపర్ లీకేజీల్లో సంజీవ్ కుమారుడు హస్తం!
గతంలోనూ సంజీవ్ ముఖియాపై పలు ప్రభుత్వ పరీక్షల పేపర్ లీక్ కేసులున్నాయి. బిహార్‌లోని నలందా జిల్లాకు చెందిన సంజీవ్ సాబూర్ వ్యవసాయ కళాశాలలో పని చేసినప్పుడు పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు రావడం వల్ల 2016లో వేటు పడింది. కొన్నాళ్ల పాటు జైలు శిక్షను కూడా అనుభవించాడు. ఆ తర్వాత నలందా కాలేజీ నూర్‌సరయ్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు. వాస్తవానికి సంజీవ్ ముఖియా అసలు పేరు సంజీవ్ సింగ్. భార్య మమతా దేవీ భుఠాకర్ గ్రామ పంచాయతీ ముఖియాగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి స్థానికులు ఇతడిని కూడా ముఖియాగా పిలుస్తున్నారు. అయితే సంజీవ్ కుమారుడు శివ్ కుమార్‌కూ ఈ నేరాల్లో హస్తం ఉందని తెలుస్తోంది. వృత్తిరీత్యా వైద్యుడైన శివ్ కుమార్ బిహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ 'ముఖియా సాల్వర్ గ్యాంగ్' పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
'నా కొడుకు అమాయకుడు'
తన కొడుకు రాజకీయాల్లో ఎదగడం నచ్చని వాళ్లే ఈ కేసులో అతడి పేరు తీసుకొస్తున్నారని సంజీవ్ తండ్రి జనక్ కిషోర్ ప్రసాద్ అన్నారు. 'నలందా నూర్‌సరయ్ బ్రాంచ్‌లో పని చేస్తున్నాడు. అనారోగ్య కారణాల వల్ల గత కొన్నాళ్లుగా సెలవుల్లో ఉన్నాడు. నా కొడుకు అమాయకుడు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. సంజీవ్ ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీలో సభ్యుడిగా ఉంటూ ఎదుగుతున్నారు. అది నచ్చని వాళ్లే ఈ వ్యవహారంలో సంజీవ్‌ను ఇరికిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పోలీసు అధికారి కూడా మా దగ్గరకు విచారణకు రాలేదు' అని కిషోర్ ప్రసాద్ తెలిపారు.
చీమలకు ఊపిరితిత్తులు ఉండవ్! మరెలా గాలి పీల్చుకుంటాయో తెలుసా? - How Do Ants Breathe