Neelakurinji Flowers : తమిళనాడు నీలగిరి జిల్లాలో 12 ఏళ్ల తర్వాత నీలకురింజి పూలు విరగబూశాయి. నీలిరంగు పూలతో నిండిన ఆ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్లు చాలడంలేదు. ఊదా రంగుతో కిలోమీటర్ల కొలది కొండ వాలుపై పూసిన ఈ పూలు సందర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. అక్కడి అద్భుత దృశ్యాన్ని వీక్షించాలంటే పిక్కపాటి సమీపంలోని గిరిజన ప్రాంతానికి వెళ్లాల్సిందే.
12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే!
తమిళనాడు నీలగిరి జిల్లాలోని పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాలను ఆనుకుని ఉన్న కొండలపై విరగబూసిన నీలకురింజి పూలు సందర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి పూసే ఈ పూలతో ఆ పర్వత ప్రాంతం నీలిరంగు అలముకొంది. ఈ అద్భుతమైన పూలు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఉంటాయి. కనుక కనుచూపు వరకు పరుచుకున్న ఆ పూల అందాలను వీక్షించేందుకు పర్యటకులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.
#WATCH | Nilgiris, Tamil Nadu: Neelakurinji flowers, which bloom once in 12 years, are blooming near Utagai, the hills adjacent to the Toda tribal village called Pikkapathi Mandu. pic.twitter.com/5vgBp7c7QB
— ANI (@ANI) September 18, 2024
జీవితంలో ఒక్కసారే!
ఈ నీలకురింజి పువ్వుల పరపరాగ సంపర్కానికి చాలా కాలం అవసరం అవుతుంది. అందుకే ఇవి వికసించడానికి 12 ఏళ్లు పడుతుంది. అంతేకాదు ఈ నీలకురింజి మొక్కలు జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పూస్తాయి. ఈ మొక్క మొలకెత్తిన తర్వాత 12 ఏళ్లకు పూతపూసి, ఆ తర్వాత పూర్తిగా ఎండిపోతుంది. ఆ మొక్క నుంచి రాలిన విత్తనాల నుంచి మళ్లీ కొత్త మొక్కలు మొలిచి 12 ఏళ్లకు పూతపూస్తాయి. అందుకే ఈ నీలకురింజి పువ్వులు వికసించటానికి 12 సంవత్సరాలు పడుతుంది.
240 జాతులు
ప్రపంచవ్యాప్తంగా కురింజి పూల మొక్కల జాతులు 240 ఉన్నాయి. భారత్‌లో 46 జాతులకు చెందిన కురింజి మొక్కలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నీలకురింజి అంటే మలయాళంలో నీలం రంగు పువ్వు అని అర్థం. ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనేను వ్యాపారులు ద్రవబంగారంగా భావిస్తారు. గతంలో తమిళనాడులోని పాలియన్ తెగ ప్రజలు తమ వయస్సును లెక్కించేందుకు ఈ పువ్వును ప్రామాణికంగా ఉపయోగించేవారు.
అక్కడ కూడా
కేరళ ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్‌లో కూడా నీలకురింజి పూల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చివరిసారిగా 2018లో నీలకురింజి పూలు వికసించాయి. ఈ ఏడాది కల్లిపారా కొండలలో 10 ఎకరాల ప్రాంతంలో నీలకురింజి పువ్వులు విరబూశాయి. మళ్ళీ మున్నార్‌లో తదుపరి నీలకురింజి పుష్పించేది 2030లో మాత్రమే.