Mussoorie Road Accident : ఉత్తరాఖండ్ ముస్సోరీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు లోయలో పడిపోవడం వల్ల శనివారం ఉదయం జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో నలుగురు యువకులు, ఓ యువతి ఉన్నట్లు గుర్తించారు. మరో యువతి తీవ్రంగా గాయపడినట్లు, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులంతా దెహ్రాదూన్ ఐఎంఎస్ కాలేజీకి చెందినవారని భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ముస్సోరీ-దెహ్రాదూన్ రహదారిపై ఝరిపానీ గ్రామం వద్ద ఓ కారు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు యువతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే ముస్సోరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులను అంబులెన్స్‌లో దెహ్రాదూన్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఓ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మరో యువతి ప్రాణాలతో పోరాడుతోంది.
లోయలో ఉన్న నలుగురి యువకుల మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం పరీక్షల కోసం ముస్సోరి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. విద్యార్థులందరూ దెహ్రాదూన్ నుంచి ముస్సోరీ సందర్శనకు వెళ్లి తిరిగి వెళ్తుండగా శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. కారు బోల్తా కొట్టిన ప్రమాదంలో నయనశ్రీ గాయపడగా, హృదయాంశ్ చంద్ర, తనూజ, అశుతోష్ తివారీ, అమన్ సింగ్ రాణా, దిగాంశ్ ప్రతాప్ భాటి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
సీఎం సంతాపం
ముస్సోరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడం బాధాకరమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, ఈ బాధను తట్టుకునే శక్తి వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాన్నానని ట్వీట్ చేశారు.
మినీ ట్రక్కును ఢీకొట్టిన రవాణా వాహనం
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. 23 మంది గాయపడ్డారు. మినీ ట్రక్కును సరుకు రవాణా వాహనం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. మృతులను పాతర్రా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.