Mushroom On Live Frog : సాధారణంగా పుట్టగొడుగులు నేలపైన, గోడలమీద, చెట్టు మొదళ్లపైనో మొలకెత్తడం మనం చూసే ఉంటాం. కానీ, కర్ణాటక బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డబళ్లాపూర్‌లో మాత్రం వింతగా ఓ కప్ప శరీరంపై మొలిచింది. ఇది చూసిన వారంతా దీనిని ఓ సైన్స్ వండర్‌గా పేర్కొంటున్నారు. అయితే ఈ ఆశ్చర్యాన్ని తొలిసారి ప్రపంచం మందుకు తీసుకువచ్చిన ఘనత వై.టీ. లోహిత్ అనే ఎంటమాలజిస్ట్ (కీటకాల శాస్త్రవేత్త) అతడి బృందానికి దక్కుతుంది. లోహిత్ ప్రస్తుతం వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.
బంగారపు కప్పపై తెల్లటి పుట్టగొడుగు
వై.టీ లోహిత్ పక్షులు, కీటకాలు, పాములపై అధ్యయనం చేస్తుంటారు. ఇందులో భాగంగా లోహిత్ తన బృందంలోని సభ్యులైన చిన్మయ్ సి మాలియే, నవీన్ అయ్యర్, బీజీ నిషా, ఎస్ ఆశతో కలిసి కప్పలు, పాములపై పరిశోధన చేసేందుకు ఇటీవలే కర్ణాటక చిక్కమగళూరులోని కుద్రేముఖ్ పర్వత శ్రేణిలో ఉన్న మాలా గ్రామానికి వెళ్లారు. అధ్యయనంలో భాగంగా లోహిత్ అండ్ టీం అక్కడ ఓ కప్పల గుంపును గమనించింది. దాదాపు 50 కప్పలున్న ఆ గుంపులో ఓ కప్ప, శాస్త్రవేత్తల బృందానికి ప్రత్యేకంగా కనిపించింది. వెంటనే దానిని స్పెషల్ కెమెరాల్లో బంధించారు లోహిత్. అలా క్లిక్ చేసిన ఫొటోల్లో ఓ బంగారపు రంగు కప్ప శరీరంపై ఓ చిన్నపాటి తెల్లటి పుట్టగొడుగు మొలకెత్తడాన్ని గుర్తించారు.
అక్కడ మాత్రమే కనిపించే కప్పలు
శాస్త్రీయ ప్రపంచంలో జీవులపై పుట్టగొడుగులు మొలవటం ఇదే మొదటిది. కప్పపై మొలకెత్తిన పుట్టగొడుగును మైసినా లేదా బోనెట్ మష్రూమ్ అని అంటారు. జంతువు, మొక్కల జాతులకు చెందని పుట్టగొడుగులు ఫంగై(శిలీంధ్రాల) క్లాస్‌కు చెందినది. అలాగే గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్లు(బంగారపు కప్పలు) కూడా పశ్చిమ కనుమల(వెస్టెర్న్ ఘాట్స్)లో మాత్రమే కనిపిస్తాయి. కప్పపై మొలిచిన బోనెట్ మష్రూమ్ కూడా కేవలం కుళ్ళిన లేదా చెదలు పట్టిన చెక్కపైన మాత్రమే మొలుస్తుంది. అయితే సజీవంగా ఉన్న ఓ జీవిపై పుట్టగొడుగు పెరగడం సైన్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి రికార్డుగా అభివర్ణిస్తున్నారు జంతు శాస్త్రవేత్తలు.
"కొన్ని శిలీంధ్రాలు(ఫంగైలు) ఉభయచరాలలో వ్యాధులకు కారణమే కాకుండా మరణానికి దారితీస్తాయి. సాధారణంగా కీటకాలు, సాలెపురుగులలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే, జీవించి ఉన్న కప్పపై మొలిచిన ఈ మష్రూమ్కు సంబంధించిన ఫంగస్‌పై లోతైన శాస్త్రీయ పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇప్పుడే దీనికి గల కచ్చితమైన కారణాలను చెప్పలేము. అధ్యయనాల తర్వాత మరింత స్పష్టత రావచ్చు."
- వై.టీ లోహిత్, ఎంటమాలజిస్ట్
ఏఐ మాయ అనుకున్నారంతా
కప్పపై మొలకెత్తిన పుట్టగొడుగు ఫొటోలను మొదట గమనించిన శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు దానిని కృత్రిమ మేథ(ఏఐ) సాయంతో లేదా ఫొటోషాప్‌లో తయారు చేసిన చిత్రాలుగా భావించారు. అయితే దీనికి సంబంధించి ఓ కథనం అంతర్జాతీయ జర్నల్ రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్‌లో ప్రచురిచతం కావడం, అంతేకాకుండా iNaturalist, ఇండియా బయోడైవర్సిటీ పోర్టల్‌లు కూడా ధ్రువీకరించడం వల్ల జంతు శాస్త్రవేత్తలు ఈ అద్భుతం నిజమేనని తేల్చారు.
PHD చేసిన 89 ఏళ్ల వృద్ధుడు- తొలి సీనియర్ గ్రాడ్యుయేట్‌గా రికార్డు!
మహిళా కాటికాపరి- 14 ఏళ్లలో 40వేలకుపైగా మృతదేహాలు దహనం- ఎక్కడో తెలుసా?