Coaching Centres Sealed In Delhi : రావూస్ ఐఏస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో దిల్లీ మున్సిపాలిటీ చర్యలకు ఉపక్రమించింది. అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు అధికారులు సీల్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ దుర్ఘటనపై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఓ ఎన్జీఓ పిటిషన్ను దాఖలు చేసింది.
14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్
రావూస్ కోచింగ్ సెంటర్‌లో డ్రైనేజీ వ్యవస్థ, భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నేరపూరిత హత్య, ఇతర అభియోగాల కింది అరెస్టైన కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, సెంటర్ కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌కు కోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పార్కింగ్, సరుకు నిల్వ పేరుతో అనుమతి తీసుకొని సెల్లార్‌లో అక్రమంగా లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిందితుడు అభిషేక్ గుప్తా అంగీకరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నమోదు చేసినట్లు డీసీపీ ఎమ్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రమాద సమయంలో 18మందికి పైగా విద్యార్థులు లైబ్రరీలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, సెల్లార్ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం, భారీగా వచ్చిన వర్షపునీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదన్న వార్తలపై విచారణ చేస్తామని చెప్పారు. ఆ సెల్లార్‌లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు.
'విచారణకు సహకరిస్తాం'
ఈ దుర్ఘటన తమను కలచివేసిందని, విచారణలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పరిపాలన నిర్లక్ష్యానికి ముగ్గురు విద్యార్థులు బలికావడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ దిల్లీ మంత్రి ఆతిశీ, స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.