Millionaire Sweeper UP : సాధారణంగా ఏదైనా కార్యాలయంలో పనిచేసే స్వీపర్ జీతం రూ.వేలల్లో ఉంటుంది. అతడి జీతం కుటుంబ పోషణకు, పిల్లలకు చదువు కొంత ఖర్చవ్వగా కొంత డబ్బు మిగులుతుంది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన ఓ స్వీపర్ చేతివాటం చూపించి కోట్లకు పడగెత్తాడు. ఏకంగా అతడి వద్ద 9 లగ్జరీ కార్లు ఉన్నాయి. అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అక్రమ మార్గంలో రూ.కోట్ల సంపాదన
గోండా మున్సిపాలిటీలో సంతోశ్ జైస్వాల్ అనే వ్యక్తి మొదట పారిశుధ్య కార్మికుడిగా పనిచేసేవాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్‌గా పదోన్నతి పొందాడు. ఈ క్రమంలో ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేసి రూ. కోట్లలో ఆస్తులను సంపాదించాడు. ఫైళ్లు తారుమారు అవ్వడం వల్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దేవీపటాన్ డివిజన్ కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రా విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో సంతోశ్ జైస్వాల్ ఫైళ్లను తారుమారు చేశాడని తెలియడం వల్ల అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది. సంతోశ్ ఆస్తులను పరిశీలించాలని తహసీల్దార్‌ను కమిషనర్ ఆదేశించారు.
విచారణలో విస్తుపోయేలా ఆస్తులు
ఈ విచారణలో సంతోశ్ గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సంతోశ్ విలాసవంతమైన వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్ పోర్ట్ అధికారికి లేఖ రాశారు కమిషనర్. ఈ క్రమంలో సంతోశ్ వద్ద 9 లగ్జరీ వాహనాలు ఉన్నట్లు తేలింది. ఈ వాహనాలు సంతోశ్ అతడి సోదరుడు, భార్య పేరు మీద ఉన్నట్లు అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్ పోర్ట్ అధికారి నివేదికలో తేల్చారు. సంతోశ్ పేరు మీద స్విఫ్ట్ డిజైర్, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా స్కార్పియో, ఇన్నోవా, మహీంద్రా జైలో వంటి కార్లు ఉన్నాయి. సంతోశ్ సోదరుడు ఉమాశంకర్ జైస్వాల్ పేరిట మారుతి సుజుకి ఎర్టిగా, సంతోశ్ భార్య పేరిట టొయోటా కారు ఉంది. స్వీపర్‌గా పనిచేసే సంతోశ్ వద్ద ఇన్ని లగ్జరీ కార్లు ఉండడం వల్ల అధికారులకు అనుమానం వచ్చి అతడి బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. సంతోశ్‌కు ఖాతా ఉన్న బ్యాంకుకు అతడి ఐదేళ్ల ట్రాన్సాక్షన్స్ వివరాలను కోరారు. ఇవి అందిన తర్వాత సంతోశ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కోటీశ్వరుడిగా మారిన బిచ్చగాడు పప్పు- సిటీలో కాస్ట్లీ ల్యాండ్- ప్రైవేట్ స్కూల్లో పిల్లల చదువు!
ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బిచ్చగాడిగా భరత్ జైన్.. ఆస్తి విలువ ఎంతంటే..