Mahatma Gandhi Jayanti 2024 : "ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే భావి తరాల వారు నమ్మలేకపోవచ్చు" మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇంతటి మహోన్నత మానవమూర్తి గురించి, మన జాతిపిత గురించి తెలుసుకోవడం మనందరి విధి.
జననం - విద్యాభ్యాసం
భారతజాతి ముద్దుగా బాపు అని పిలుచుకునే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869, అక్టోబరు 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సాంప్రదాయ కుటుంబం. చిన్నప్పటి నుండి అసత్యమాడడం గాంధీకి గిట్టని పని. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా పోర్‌బందర్‌లోను, రాజ్‌కోట్‌లోనూ కొనసాగింది.
వివాహం
గాంధీజీకి 13 ఏళ్ల వయస్సులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు.
మూడు ప్రమాణాలు
ఇంగ్లాండులో బారిస్టర్ చదవడానికి వెళ్ళినప్పుడు గాంధీజీ తన తల్లికి మద్యం, మాంసం, స్త్రీని ముట్టనని మూడు ప్రమాణాలు చేశారు. తల్లికిచ్చిన మాట ప్రకారం, ఆయన జీవితాంతం మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు.
జాతి వివక్షత
గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ తెల్లదొరల చేతిలో అనేక సార్లు జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. ఆంగ్లేయులు నల్లజాతి వారి పట్ల చూపే వివక్షతను సహించలేని గాంధీజీ వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, పోరాట పటిమను పెంచుకొన్నారు.
సత్యాగ్రహమే ఆయుధంగా!
సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడికి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటిన బాపూజీ ఒక దశలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం లభించే దాకా అలుపెరగని పోరాటం సాగించిన ధీరుడు.
ఆంగ్లేయులను గడగడలాడించిన ఉద్యమాలు
స్వతంత్ర సమరంలో ఎన్నో సార్లు జైలు కెళ్లిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాలతో ఆంగ్లేయులను గడగడలాడించి వారి గుండెల్లో నిద్రపోయారు. ఆంగ్లేయులు ఇక భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పదన్న నిర్ణయానికి వచ్చేవరకు గాంధీజీ అలుపెరగని పోరాటం చేశారు.
దేశ విభజనను వ్యతిరేకించిన గాంధీజీ
హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు అందరూ అన్నదమ్ములు లాగా ఉన్న దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ముస్లిం లీగ్ నాయకుడైన ముహమ్మద్ ఆలీ జిన్నా "దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి" అని హెచ్చరించారు. హిందూ ముస్లింల అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేక గత్యంతరం లేక దేశవిభజనకు గాంధీజి అంగీకరించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా, దేశ విభజన వల్ల విషణ్ణుడైన గాంధీజీ మాత్రము కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపారు. 1948 జనవరి 30వ తారీఖున దిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనకు వెళుతున్న గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ భారత ప్రపంచం ఉలిక్కిపడింది. భారతదేశ ప్రజలందరూ బాపు, బాపు అని కన్నీరు మున్నీరయ్యారు. బాపు మరణంతో ఒక శకం అంతమైంది. ఒక ఉద్యమానికి తెర పడింది.
స్వాతంత్య్రం నిజంగా వచ్చిందా!
ఇంత కష్టపడి గాంధీజీ తెచ్చిన స్వాతంత్య్రాన్ని పదిలంగా కాపాడుకోవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. గాంధీజీ కళలు కన్నట్లుగా ఈనాడు మహిళలు అర్థరాత్రి కూడా స్వేచ్ఛగా తిరుగుతన్నందుకు సంతోషించాలా! లేక పట్ట పగలు కూడా అత్యాచారాలకు గురవుతున్న మహిళలను చూసి 'ఏది బాపూ! నీవు తెచ్చిన స్వాతంత్య్రం ఎక్కడ?' అని ఆవేదన చెందాలో అర్థం కాని అయోమయంలో నేటి భారతం ఉంది.
బాపూజీని అనుసరిద్దాం - స్వాతంత్య్రాన్ని కాపాడుకుందాం!
సత్యవ్రతం, నిజాయితీ, నిగ్రహం, పవిత్రత, శాకాహారం బాపు జీవన విధానం. ఈ జీవన విధానంతో ఎవరైనా మారుతారు. బాపూజీ చూపించిన మార్గంలో నడుస్తూ, ఆయన అవలంభించిన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబిస్తే దేశంలో నేరాలు ఉండవు. అవినీతి, అరాచకాలు ఉండనే ఉండవు. మనమందరం గాంధీజీ ఆచరించి చూపించిన మార్గంలో నడుస్తూ దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను గాడిలో పెట్టడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. అదే అసలైన స్వతంత్ర భారతం.
భారత్ మాతాకీ జై!