Assembly Election 2024 : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. వీటితోపాటు నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా శనివారమే జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం మహారాష్ట్రవ్యాప్తంగా 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు 288 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని చేయాల్సి ఉంది.
మూడు అంచెల భద్రత
కౌంటింగ్ సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సెంట్రల్ భద్రత బలగాలు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలు సీసీటీవీ నిఘాలో ఉన్నాయని, వాటి ఫుటేజీని అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను తెరవనున్నట్లు చెప్పారు. ముంబయిలో 36 కౌంటింగ్ కేంద్రాలకు 300 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడడాన్ని పోలీసులు నిషేధించారు. నవంబర్ 24 అర్ధరాత్రి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు.
గెలుపెవరిదో?
మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మెుత్తం 66.05 శాతం పోలింగ్ నమోదైంది. అదే రోజు నాందేడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో 67.81 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన శిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన-యూబీటీ 95, ఎన్సీపీ-ఎస్పీ 86 స్థానాల్లో బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది.
కాంగ్రెస్ అలర్ట్
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడికానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక చర్యలు తీసుకుంది. ఎన్నికల అనంతర పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, డాక్టర్ జి.పరమేశ్వరను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. తారిఖ్ అన్వర్, మల్లు భట్టివిక్రమార్క, కృష్ణ అల్లవూరును ఝార్ఖండ్‌కు ఏఐసీసీ పరిశీలకులుగా పంపింది.