Longest Mustache In India : జుట్టును బాగా పెంచే వాళ్లను చూస్తుంటాం. వేలిగోళ్లను బాగా పెంచే వాళ్లనూ చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తన మీసాలను పొడవుగా పెంచేశాడు. అవి ఎంత పొడవుగా తయారయ్యాయంటే, మడిచిపెట్టి ముడివేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీసాలకు వేసిన దారపు ముడిని తన చెవికి తగిలించుకొని తిరుగుతున్న అతగాడి పేరు బాల్‌కిషన్ రాజ్‌పుత్. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పుర్ జిల్లా రత్ తహసీల్‌లోని బరువా గ్రామస్థుడు. 64 ఏళ్ల వయసున్న బాల్‌కిషన్‌కు ప్రస్తుతం 24 అంగుళాల సైజులో మీసాలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే, అతడు గత 35 ఏళ్లుగా మీసాలు కట్ చేయనే లేదు. ఈయన గురించి మరిన్ని విశేషాలివే.
ఫ్లాష్ బ్యాక్
బాల్‌కిషన్ రాజ్‌పుత్ ఒక రైతు. అతడికి భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు. అందరిలాగే కుటుంబ జీవితం గడిపే బాల్‌కిషన్ ఇంతలా మీసాలు పెంచేందుకు కారణమైన అంశం ఏమిటి ? అనే దానికి ఆయనే స్వయంగా సమాధానం చెప్పారు. 1991 నాటి తన ఫ్లాష్ బ్యాక్‌ను గుర్తు చేసుకున్నారు. ''ఓ రోజు పోలీసులు నన్ను అనవసరంగా అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌లోని లాకప్‌లో ఉంచారు. ఆ తర్వాత మీసాలున్న చాలామందిని తీసుకొచ్చి అదే లాకప్‌లోకి నెట్టారు. వారిలో ఓ వ్యక్తికి 24 అంగుళాల మీసాలు ఉండటాన్ని చూశాను. ఆ తర్వాత అక్కడికి మున్సిఫ్ మెజిస్ట్రేట్ వచ్చారు. లాకప్‌లోని వారందరినీ ఆయన ఎదుట వరుసగా నిలబెట్టారు. పూలన్ దేవి ముఠాకు చెందిన గజదొంగ లఖన్ సింగ్‌ను గుర్తించేందుకే ఇంతలా పోలీసులు హైరానా పడుతున్నారని అప్పుడు నాకు అర్థమైంది. అప్పట్లో నా మీసాల పొడవు కేవలం 8 అంగుళాలే. నా వైపు చూసిన మున్సిఫ్ మెజిస్ట్రేట్, నవ్వారు. నన్ను ఏదో తిడుతూ అవహేళనగా పక్కకు నెట్టారు. ఆ క్షణంలోనే నేను కూడా మీసాలను పొడవుగా పెంచాలని నిర్ణయించుకున్నాను. లాకప్‌లో 24 అంగుళాల మీసాలతో ఉన్న వ్యక్తే గజదొంగ లఖన్ సింగ్ అని ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది'' అని బాల్ కిషన్ వివరించారు.
మీసాలను పసిపాపల్లా కాపాడుకుంటూ
''ఆ ఘటన జరిగినప్పటి నుంచి నా మీసాలను పసిపాపల్లా కాపాడుకుంటూ వచ్చాను. అవి పెరిగేందుకు మంచి పోషకాహారం తిన్నాను. చివరకు మా నాన్న చనిపోయినప్పుడు కూడా మీసాలను కట్ చేయలేదు. వాటి సైజును తగ్గించి వదిలేశాను. దాదాపు 33 ఏళ్లుగా నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మీసాలివి. ఇవి నాకు ఎంతో పేరును తెచ్చాయి. ఎన్నోచోట్ల సన్మానాలు కూడా జరిగాయి'' అని ఆయన చెప్పారు. చివరకు మహిళలు కూడా తన మీసాలను మెచ్చుకుంటూ ఉంటారని ఆయన తెలిపారు. పచ్చి ఉసిరి, మజ్జిగతో జుట్టును కడిగితే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడవుగా తయారవుతాయని మహిళలకు సలహా ఇస్తుంటానని పేర్కొన్నారు. మీసాలను ఇంత పొడవుగా పెంచినందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌లో ఐదు వేల రూపాయల బహుమతి కూడా వచ్చిందని బాల్ కిషన్ తెలిపారు. గతేడాది తన అల్లుడి హత్య జరిగిందని దానిపై కంప్లయింట్ చేసేందుకు ఇటీవల యూపీలోని గోరఖ్‌నాథ్ ఆలయంలో నిర్వహించిన జనతా దర్బార్‌లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. తన అల్లుడి హత్యపై దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని సీఎంను కోరానన్నారు బాల్‌కిషన్.