Lok Sabha Speaker Election : దేశంలో తొలిసారి లోక్‌సభ స్పీకర్ కోసం ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు స్పీకర్ ఎన్నికపై కన్నేశాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకుంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 26న ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే, తాజా ఎన్నికలో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. విపక్ష ఎంపీని ఉపసభాపతిగా అంగీకరించకుంటే స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్లవుతుంది.
ఓం బిర్లాకు మరోసారి!
అయితే ఈ లోక్‌సభ స్పీకర్ పదవిని బీజేపీ దగ్గరే అట్టిపెట్టుకోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీ వద్దే ఉంటే, ఓం బిర్లాకే మరోసారి స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. ఆయన కాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఒడిశాలో బిజద నుంచి బీజేపీలోకి చేరిన భర్తృహరి మహతాబ్ పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. వీరు కాకుండా వేరేవారి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరుసార్లు స్పీకర్ ఎన్నిక
స్వాతంత్య్రానికి ముందు పార్లమెంటును సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా పిలిచేవారు. ఆ సయమంలోనే 1925-1945 మధ్య కాలంలో ఆరుసార్లు స్పీకర్ల ఎన్నిక జరిగింది. విఠల్‌భాయ్ జే పటేల్ (రెండుసార్లు), మహమ్మద్ యాకూబ్, ఇబ్రహీం రహ్మతొల్లా, శణ్ముఖం శెట్టి, సర్ అబ్దుల్ రహీమ్, జీవీ మావలంకర్ స్పీకర్లగా ఎన్నికైయ్యారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్, తాత్కాలిక పార్లమెంటు స్పీకర్‌గా జీవీ మావలంకర్ కొనసాగారు.
స్వాతంత్య్రం తర్వాత
1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మావలంకర్ మరణం కారణంగా డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న అయ్యంగార్ లోక్‌సభ స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత 1957లో జరిగిన రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా నియమితులయ్యారు. అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏకాభిప్రాయంతోనే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగుతూ వచ్చేది. ఎంఏ అయ్యంగార్, జీఎస్ ధిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి మాత్రమే రెండుసార్లు స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ఇట్స్ అఫీషియల్- వయనాడ్‌కు రాహుల్ బై, రాయబరేలీకి జై- ఉపఎన్నికకు ప్రియాంక సై