Lok Sabha Polls Rahul Priyanka : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంబంధిత వర్గాల తెలిపాయి. ఈ అంశంపై ఏప్రిల్ 26 తర్వాత పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి. ఈ రెండు స్థానాలకు నామినేషన్ వేసేందుకు మే 3 ఆఖరు తేదీ కాగా దానికి రెండు రోజుల ముందే రాహుల్, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామినేషన్ వేసే అవకాశాలున్నట్లు వెల్లడించాయి.
బాలరాముడిని దర్శించుకున్న తర్వాతే!
ఈ క్రమంలోనే ఆయా స్థానాల్లో ప్రచారం మొదలుపెట్టడానికి ముందు వీరు అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉన్న నేపథ్యంలో రాహుల్, ప్రియాంక అక్కడకి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అన్నాచెల్లెళ్లిద్దరూ కలిసి!
రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళ వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. వయనాడ్‌లో పోలింగ్ జరిగే శుక్రవారమే అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వయనాడ్‌లో ప్రచారం ముగియడం వల్ల అన్నాచెల్లెళ్లిద్దరూ ఉత్తర్‌ప్రదేశ్‌లో సీట్లపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. 2004 నుంచి వరుసగా మూడు సార్లు అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు.
తాజా ఎన్నికల్లో మరోసారి బీజేపీ స్మృతి ఇరానీని అమేఠీ బరిలో నిలపగా కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అమేఠీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశాలుండగా అటు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా సైతం ఆ స్థానం బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. బుధవారం అమేఠీలోని గౌరీగంజ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెలుపల రాబర్ట్ వాద్రా ఉన్న పోస్టర్లు కనిపించడం వల్ల ఆయన టికెట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
రాజ్యసభకు ఎన్నికవ్వడం వల్ల!
1960 నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆమె లోక్‌సభ బరి నుంచి వైదొలిగి రాజ్యసభకు ఎన్నికవ్వడం వల్ల ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని సంబంధిత వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న ఈ రెండు స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య జరిగిన సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ ఎన్నికల్లో యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ 63 , కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ రాయ్‌బరేలీ, అమేఠీలతో పాటు వారణాసి, ఘాజియాబాద్, కాన్పూర్ తదితర చోట్ల బరిలో నిలిచింది.
'మోదీ అలా ఎందుకు మాట్లాడారు?'- సమాధానం చెప్పాలని బీజేపీకి ఈసీ ఆదేశం - Lok Sabha Elections 2024
కేరళ పాలిటిక్స్‌లో ట్విస్ట్ - 'ట్వంటీ20' దూకుడు- ప్రధాన పార్టీలకు టెన్షన్! - Lok Sabha Election 2024