Lok Sabha Elections 2024 Second Phase : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జరిగిన రెండో విడత పోలింగ్ పూర్తైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతాలు ఇలా
ఓటర్ టర్న్ అవుట్ యాప్ ప్రకారం, సాయంత్రం 5గంటల వరకు అసోంలో 70.66 శాతం పోలింగ్ నమోదు కాగా బిహార్‌లో 53.03, ఛత్తీస్‌గఢ్ 72.13, జమ్ముకశ్మీర్ 67.22, కర్ణాటక 63.90, కేరళ 63.97, మధ్యప్రదేశ్ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్ 76.06, రాజస్థాన్ 59.19, త్రిపుర 77.53, ఉత్తర్‌ప్రదేశ్ 52.74, బంగాల్ 71.84 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.
రెండో విడతలో కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగ్గా, కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు 14చోట్ల పోలింగ్ జరిగింది. రాజస్థాన్‌లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ జరగ్గా, మిగిలిన 13 చోట్ల పూర్తి అయింది. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అసోం, బిహార్‌లో ఐదేసి, మధ్యప్రదేశ్‌లో ఆరు, బంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో మూడేసి, త్రిపుర, మణిపుర్, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరిగింది.
ఓటేశారు- స్ఫూర్తిని చాటారు!
ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. కొత్త ఓటర్లతో పాటు కొత్తగా పెళ్లయిన జంటలు సంప్రదాయ వస్త్రధారణతో పలుచోట్ల పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా వచ్చి ఓటేశారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్, నటి హేమమాలినితోపాటు పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన 85 మంది ఓటు!
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన 85 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరానకిి చెందిన బాదం కుటుంబసభ్యులు ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పోలింగ్ బూత్‌కు కలిసి వెళ్లి ఓటు వేశారు. ఇప్పటి వరకు 18కి పైగా ఎన్నికల్లో ఓటు వేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబసభ్యులంతా ఓటింగ్ రోజున ఒక్కటయ్యారు.