Lok Sabha Election Results 2024 Rahul Gandhi : సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఒక దశలో చెమటలు పట్టించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 ఎంపీ స్థానాలు మించి రావన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్థానాలు కైవసం చేసుకోవడం వెనుక రాహుల్‌గాంధీ కృషి ఎంతో ఉంది. దేశవ్యాప్త యాత్రలతో రాహుల్ గాంధీ ప్రజలతో మమేకం కావడం వల్లే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగాయని, హస్తం పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. రాహుల్ యాత్రలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఖ్యాతిని పెంచాయని పేర్కొన్నారు.
రాహుల్ యాత్ర వల్లే
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా రెండు యాత్రలు చేశారు. ఈ యాత్రల్లో రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాల ప్రజాస్వామిక హక్కుల రక్షణ, ఓబీసీ రిజర్వేషన్లపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా ఆ మూడు అంశాలను క్షేత్రస్థాయిలో వివరించి ప్రజలు ఆలోచించేలా చేశారు. వాటి వల్లే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయావకాశాలు పెరిగాయి. రాహుల్‌గాంధీ చేసిన యాత్ర ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకు, ప్రతిపక్ష ఇండి కూటమిలో చేరిన విభిన్న రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి దోహదపడింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 52 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి 99 స్థానాలు దక్కించుకుంది. 2014లో 44, 2019లో 52 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్‌కు సుమారు వంద స్థానాలు రావడం వెనక రాహుల్‌గాంధీ పాత్ర కీలకం.
కాంగ్రెస్ పునరుజ్జీవం
2022, 2023లో రాహుల్‌గాంధీ రెండు యాత్రలు చేశారు. ఈ యాత్ర వల్ల కాంగ్రెస్ పునరుజ్జీవనం వైపు సాగుతుందన్న నమ్మకం ప్రజలకు కలిగింది. రాహుల్ యాత్ర సాగే దారి పొడవునా లక్షలాది మంది ప్రజలు తమ సంఘీభావాన్ని తెలిపేందుకు తరలివచ్చారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచింది. పార్టీ-ప్రజల మధ్య అనుబంధాన్ని పునరుద్ధరించింది. రెండు జోడో యాత్రలు ఇండియా కూటమిలోని పార్టీల మధ్య ఐక్యతను కూడా పెంచాయి. సమాజ్ వాదీ పార్టీతో కలిసి రాహుల్ చేసిన సోషల్ ఇంజినీరింగ్ కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లో కూటమి ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించడంలో సహాయపడింది. అలాగే యాత్రలో ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ పుంజుకోవడానికి దోహదపడ్డాయి. నిరుద్యోగంపై రాహుల్ సంధించిన ప్రశ్నలు కూడా ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లాయి. రాయ్ బరేలీలో పోటీలో చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇండియా కూటమికు మంచి ఫలితాలు రావడానికి కారణమైంది.
దూకుడుగా ప్రచారం
మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రచారం చేశారు రాహుల్ గాంధీ. ఈ దూకుడు స్వభావమే కాంగ్రెస్ అవకాశాలను పెంచిందని ఏఐసీసీ యూపీ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ తౌకిర్ ఆలం అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని నిలకడగా ఎదుర్కొన్న ఏకైక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనే కావడం విశేషం. 2019లో కాంగ్రెస్ పరాజయం తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2022 అక్టోబర్‌లో మల్లికార్జున ఖర్గేను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే రాహుల్ గాంధీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు బీజేపీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, అయినా ఏమి సాధించలేకపోయారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
NDAను సేవ్ చేసిన సౌత్! ఏపీదే కీ రోల్- మరోసారి ఆదుకున్న కంచుకోటలు - Lok Sabha Election Result 2024