Evm Not Working While Voting : మనదేశంలో ఏప్రిల్ 19న (శుక్రవారం) తొలివిడత సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొదటి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. అయితే, ఎన్నికల వేళ ఈవీఎంల వినియోగంపై చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పుడు బటన్‌ను నొక్కితే ఏమవుతుంది? ఓటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎం పనిచేయడం ఆగిపోతే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నలు ఎంతోమంది ఓటర్ల మదిలో ఉదయిస్తుంటాయి. వీటికి సమాధానాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం. ఇందులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని బ్యాలెట్ యూనిట్ (బీయూ) అంటారు. మరో భాగాన్ని కంట్రోల్ యూనిట్ (సీయూ) అంటారు. మనం ఓటును నమోదు చేసే ఈవీఎం యంత్రాన్ని బ్యాలెట్ యూనిట్ (బీయూ)గా పిలుస్తారు. దీన్ని ప్రత్యేకమైన ఓటింగ్ కంపార్ట్‌మెంట్ లోపల ఉంచుతారు. అందులోకి వెళ్లి మనం రహస్యంగా ఓటు వేయొచ్చు. కంట్రోల్ యూనిట్ (సీయూ) అనేది ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి దగ్గర ఉంటుంది. ఐదు మీటర్ల కేబుల్‌తో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ కనెక్టయి ఉంటాయి. ఎంతమంది ఓటు వేశారు అనే సమాచారం కంట్రోల్ యూనిట్ (సీయూ)లో ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతుంటుంది. వీటికి అదనంగా 'ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్' (వీవీ ప్యాట్) యంత్రం కూడా అక్కడే రెడీగా ఉంటుంది. మనం ఈవీఎంలో ఓటు వేయగానే వీవీ ప్యాట్‌లో నుంచి ఒక స్లిప్ బయటికి వచ్చి అక్కడే కింద అమర్చిన బాక్సులో పడిపోతుంది. ఈవీఎంలు పనిచేయడానికి కరెంటు అవసరం లేదు. అవి బ్యాటరీపై పనిచేస్తాయి. అందువల్ల విద్యుత్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలను వినియోగించుకోవచ్చు.
ఈవీఎం అకస్మాత్తుగా చెడిపోతే ఏమవుతుంది?
ఓటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే ఏమవుతుంది? దానిలో ఓట్లను నమోదు చేసే పరిస్థితి లేకుంటే ఏమవుతుంది? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. ఒకవేళ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లలో ఏ ఒక్కటి టెక్నికల్‌గా పనిచేయకున్నా గాబరా పడాల్సిన పనిలేదు. అప్పటివరకు ఓటర్లు వేసిన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్‌లోని మెమొరీలో సేవ్ అయి ఉంటాయి. ఒకవేళ ఆ సమాచారం కూడా దొరకని పరిస్థితి ఎదురైతే వీవీ ప్యాట్ యంత్రం నుంచి వచ్చిన స్లిప్పులు ఎలాగూ ఉంటాయి.
పోలింగ్ స్టేషనులో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌ల్లో ఏ ఒక్కటి మొరాయించినా వెంటనే కొత్తగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్‌ల సెట్‌ను అక్కడికి పంపిస్తారు. జోనల్ మెజిస్ట్రేట్లు, ఏరియా మెజిస్ట్రేట్ల పరిధిలో రిజర్వులో ఉండే ఎన్నికల సామగ్రి నుంచి వీటిని కేటాయిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున అన్ని ఈవీఎంలలో నమోదైన ఓట్లను కౌంట్ చేస్తారు. ఏదైనా సాంకేతిక కారణంతో కంట్రోల్ యూనిట్‌లోని ఓట్లు డిస్‌ప్లే కాకపోతే ఫలితాన్ని పొందడానికి సంబంధిత కంట్రోల్ యూనిట్‌కు చెందిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఒకవేళ వీవీ ప్యాట్ యంత్రం ఒక్కటే మొరాయిస్తే దాని స్థానంలో మరో కొత్త వీవీ ప్యాట్ యంత్రాన్ని రీప్లేస్ చేస్తారు.
ఈవీఎంలోని తప్పు బటన్‌ను నొక్కితే ఏమవుతుంది?
ఓటరు పొరపాటున ఈవీఎంలోని ఏదైనా తప్పుడు బటన్‌ను నొక్కితే ఎలా? ఆ ఓటు నమోదైనట్టా? మరోసారి ఓటు వేసేందుకు ఛాన్స్ ఇస్తారా? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. ఓటరు ఈవీఎంపై రాజకీయ పార్టీ/అభ్యర్థికి సంబంధించిన గుర్తు వద్ద ఉండే బటన్‌ను నొక్కగానే రెడ్ కలర్ సిగ్నల్ వస్తుంది. ఆ వెంటనే బీప్ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా అదనంగా వీవీ ప్యాట్ నుంచి ఒక స్లిప్ రిలీజవుతుంది. మన ఓటు నమోదైంది అనేందుకు ఇవన్నీ ధ్రువీకరణలు! ఒకవేళ మనం పొరపాటున ఈవీఎంపై తప్పుడు బటన్‌ను నొక్కి ఓటు నమోదు కాకపోతే మరోసారి ఓటు వేయడం అంత ఈజీ కాదు. దాని కోసం అక్కడున్న పోలింగ్ అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. పోలింగ్ అధికారి వెంటనే వచ్చి ఈవీఎంలో ఉండే ఒక బటన్‌ను నొక్కితేనే మరోసారి ఫ్రెష్‌గా ఓటు వేసేందుకు అవకాశం కలుగుతుంది. 'ఎన్నికల ప్రవర్తన నియమాలు- 1961'లోని రూల్ నంబర్ 49MA ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ఓటరు నుంచి రాతపూర్వక ప్రకటనను ప్రిసైడింగ్ అధికారి కోరే అవకాశం ఉంటుంది. ఓటరు చేస్తున్న క్లెయిమ్ నిజమైనదని రుజువయితేనే రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకొని మరోసారి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఈక్రమంలో రిటర్నింగ్ అధికారి అనుమతి వచ్చే వరకు ఆ ఈవీఎంలో పోలింగ్‌ను నిలిపివేస్తారు.
నాగ్‌పుర్‌లో టఫ్ ఫైట్!- భారీ మెజారిటీతో గడ్కరీ హ్యాట్రిక్ కొడతారా? - Nitin Gadkari Nagpur
లోక్‌సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెర- తమిళనాడుపై ఫుల్ ఫోకస్! - Lok Sabha Election 2024