LK Advani Bharat Ratna Award : రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ అవార్డును ఆయన నివాసంలోనే ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఆదివారం రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు అడ్వాణీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజకీయాల్లో కీలక పాత్ర
ఎల్‌కే అడ్వాణీ రాజకీయాల్లో ఏడు దశాబ్దలపైగా కీలకంగా పని చేసి దేశానికి సేవలందించారని రాష్ట్రపతి పేర్కొన్నారు. '1927లో కరాచీ (ప్రస్తుతం పాక్లో ఉంది) జన్మించిన ఆయన 1947 దేశ విభజన సమయంలో భారత్కు వలస వచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేసినప్పుడు దాని నుంచి రక్షించడంలో కీలకంగా వ్యవహిరించారు' అని ఎక్స్ వేదికగా తెలిపారు. 1977-1979 వరకు అడ్వాణీ కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు హోంమంత్రిగా, 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా పని చేశారు. 1986 - 1990, 1993- 1998, 2004 నుంచి 2005 వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఐదుగురికి భారత రత్న
ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది. వారిలో మాజీ ప్రధానులు చౌధరీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. వీరిలో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్‌లోని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భారతరత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు.
అవార్డును అందుకున్న కుటుంబ సభ్యులు
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌధురీ చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌధురీ, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు రమేశ్‌నాథ్ ఠాకూర్ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. ఎల్‌కే అడ్వాణీకి మాత్రం ఆయన నివాసానికి వెళ్లి మరీ అవార్డును ఇచ్చారు.
పవార్ ఫ్యామిలీలో 'పవర్' పాలిటిక్స్- పోటీకి వదినా-మరదళ్లు 'సై' - Supriya Sule vs Sunetra Pawar