Leopard With Different Eye Colours : వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ధ్రువ్ పాటిల్ ఇటీవల ఓ చిరుత ఫొటోను తన కెమెరాతో క్లిక్ మనిపించారు. ఫొటోను నిశితంగా పరిశీలించిన ఆయన చిరుత ఫొటోలో ఒక స్పష్టమైన తేడాను గుర్తించారు. దాని కళ్ల రంగు సాధారణ చిరుతల కంటే చాలా భిన్నంగా ఉందని నిర్ధరించుకున్నారు. ఈ మేరకు వివరాలతో ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.
"ఇలాంటి చిరుత మన దేశంలో కనిపించడం ఇదే మొదటిసారి" అనే క్యాప్షన్‌తో తాను తీసిన ఫొటోను ధ్రువ్ పాటిల్ అప్లోడ్ చేశారు. వారం క్రితం కర్ణాటకలోని గుండ్లూపేట్‌లో ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ చిరుత ఫొటోను తీసినట్లు వెల్లడించారు. "గతంలో కేరళలోని కాబిని ప్రాంతంలో నల్ల చిరుత (మెలానిస్టిక్ లియోపర్డ్) ఫొటోను తీశాను. ఇప్పుడు ఈ వెరైటీ కళ్ల చిరుత ఫొటోను కర్ణాటకలో తీశాను. భిన్నమైన జంతుజాలాన్ని నా కెమెరాలో బంధిస్తున్నందుకు ఆనందంగా ఉంది" అని ధ్రువ్ పాటిల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఎడమ కన్ను అలా- కుడి కన్ను ఇలా!
ధ్రువ్ పాటిల్ తాజాగా తీసిన ఫొటోను పరిశీలిస్తే ఆడ చీతా ఒక చెట్టుపై కూర్చొని విశ్రాంతి తీసుకోవడం కనిపిస్తుంది. దాని కళ్ల రంగు విషయానికొస్తే ఎడమ కన్ను గోధుమ రంగులో, కుడి కన్ను లేత ఆకుపచ్చ రంగులో ఉంది. ఇలా ఒకే జీవికి చెందిన రెండు కళ్లు విభిన్న రంగుల్లో ఉండే స్థితిని హెటెరో క్రోమియా అంటారు. ధ్రువ్ పాటిల్ ఫొటో తీసిన ఆడ చిరుతకు కూడా హెటెరో క్రోమియా ఉండటం వల్లే రెండు కళ్లు భిన్నమైన రంగుల్లో ఉన్నాయని నిపుణులు తెలిపారు. జన్యుపరమైన మార్పు వల్లే కళ్లలో రంగులు ఈవిధంగా మారుతుంటాయని చెప్పారు. అయితే ఈ రకమైన జన్యుమార్పు వల్ల జీవులకు ఎలాంటి హాని ఉండదట. కొన్ని జంతువులకు పుట్టుకతోనే, ఇంకొన్నింటికి గాయాలు కావడం వల్ల ఇలా కళ్లలో భిన్నమైన రంగులు ఏర్పడుతుంటాయని తెలుస్తోంది.
'ఆర్మీ సేవలకు బిగ్ సెల్యూట్' - వయనాడ్ చిన్నారి లేఖ వైరల్ - Wayanad Landslides
ఏలియన్స్‌కు గుడి కట్టిన భక్తుడు- ఆ ప్రమాదం నుంచి కాపాడుతాయని వింత వాదన! - Alien Temple Salem