Kolkata Doctor Murder Case : కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మోహరింపు విషయంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. బంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని 'సుప్రీం'కు కేంద్రం తెలిపింది. వసతి, భద్రత పరికరాల నిర్వహణ, రవాణా సౌకర్యాల లేమితో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. సీఐఎస్‌ఎఫ్‌కి పూర్తి సహకారాన్ని అందించాలంటూ బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టును కోరింది. ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించని పక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాలని విజ్ఞప్తి చేసింది.
వైద్యురాలిపై హత్యాచారం ఉదంతం తర్వాత ఆర్జీ కర్ ఆసుపత్రిపై ఆందోళన కారులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు అక్కడి నుంచి పారిపోయారన్న ఆరోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, వైద్యులకు రక్షణ కల్పించేందుకు ఆసుపత్రిలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
సీపీతో జూనియర్ వైద్యుల చర్చలు
వైద్యురాలి అత్యాచారం, ఆసుపత్రిపై దాడి ఘటనల నేపథ్యంలో కోల్‌కతా పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలంటూ సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వైద్యుల ఆందోళనతో 22 మంది జూనియర్ వైద్యుల బృందం సీపీని కలిసేందుకు అనుమతి ఇచ్చారు. వారితో సీపీ గోయల్‌తో రెండు గంటలపాటు చర్చలు జరిపారు.
సీపీతో సమావేశం అనంతరం వైద్యుల్లో ఒకరు విలేకరులతో మాట్లాడారు. ''ఆగస్టు 9న జరిగిన ఘటనలో పోలీసుల తప్పిదం ఉందని సీపీ అంగీకరించారు. ఆగస్ట్ 14 రాత్రి ఆసుపత్రిపై దాడి చేయడాన్ని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని సీపీ ఒప్పుకున్నారు. ఆందోళనలు అడ్డుకోవడంలో సీపీ విఫలమైనందుకు రాజీనామా చేయాని డిమాండ్ చేశాం. ఈ సందర్భంగా తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించినట్లు సీపీ తెలిపారు. తనపై ఎలాంటి చర్యలు చేపట్టాలో పైఅధికారులే నిర్ణయిస్తారని సీపీ చెప్పారు.'' అని ఓ జూనియర్ డాక్టర్ తెలిపారు.
సందీప్ ఘోష్‌ను సస్పెండ్ చేసిన బంగాల్ ఆరోగ్య శాఖ
మరోవైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను బంగాల్ ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సీబీఐ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేయగా, తాజాగా కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించింది.
కోల్‌కతా డాక్టర్ హత్యాచారం ఘటనపై అమెరికాలో వైద్యులు నిరసన - Houston Protest