Irular Snake Catchers : సాధారణంగా పామును చూస్తే చాలా మంది ఆమడ దూరం పరుగెడుతారు. అది విషం ఉన్న సర్పమైనా, విషంలేని పామైనా దేనిని చూసినా భయంతో వణికి పోతుంటారు ప్రజలు. అయితే తమిళనాడులోని ఇరులర్ గిరిజన తెగకు చెందిన ప్రజలకు మాత్రం ఆ పాములే జీవితాధారంగా మారాయి. విషపూరితమైన పాములను పట్టుకుని వాటి నుంచి విషం సేకరిస్తున్నారు. సొసైటీగా ఏర్పడి సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నారు.
పాము విషాన్ని సేకరించడం కోసం వాడనెమిలిలో ఇరులర్ స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్‌ను తమిళనాడు ప్రభుత్వం 1978లో స్థాపించింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఈ సొసైటీ నడుస్తోంది. తమిళనాడు ప్రభుత్వ కార్మిక సంక్షేమ శాఖ అధికారి ఈ సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా ఉంటారు. ఈ సొసైటీ స్నేక్ ఫామ్‌ను నడుపుతోంది. జులై- మార్చి వరకు గిరిజనులు పాములను పట్టుకుని స్నేక్ ఫామ్‌కు అప్పగిస్తారు. అక్కడే పాముల నుంచి విషాన్ని తీస్తారు.
రూ. కోట్లలో ఆదాయం
ఇలా పాముల నుంచి తీసిన విషాన్ని దేశంలోని వివిధ ఔషధ కంపెనీలకు విక్రయిస్తారు. గత 3ఏళ్లలో 1807.150 గ్రాముల విషాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీకి రూ.5.43 కోట్లకు విక్రయించారు. ఇందులో వాడనెమిలి స్నేక్ ఫార్మింగ్ అసోసియేషన్ నికర లాభం రూ.2.36 కోట్లుగా ఉంది.
"ఇరులర్ స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 339మంది పాములను పట్టేందుకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందారు. వారు పట్టుకున్న పాములకు డబ్బు చెల్లించి తీసుకుంటాం. రక్త పింజర, నాగు పాముకు రూ.2,760, కట్లపాటుకు రూ.1,020, వేరే రకం పాములకు రూ.360 ఇస్తాం. లైసెన్స్ ఉన్నవారు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, చెన్నై వంటి జిల్లాల నుంచి పాములను పట్టుకుని స్నేక్ ఫామ్‌కు తీసుకొస్తారు. ఇలా పట్టుకున్న పాములను 22 రోజుల పాటు ఫామ్‌లో ఉంచి నాలుగు రోజులకు ఒకసారి చొప్పున నాలుగు సార్లు విషం తీస్తాం. విషపూరితమైన పాము తోకపై ట్యాగ్ వేసి, అది బతికేందుకు అనువైన ప్రదేశంలో వదిలేస్తాం." అని ఇరులార్ స్నేక్ క్యాచర్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ 'ఈటీవీ భారత్'కు వివరించారు.
బిహార్ మాజీ మంత్రి తండ్రి దారుణ హత్య- కత్తులతో పొడిచి మర్డర్!