IRCTC iPay Autopay : మన దేశంలో రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం సవాలుతో కూడుకున్న పని. కొన్నిసార్లు, రైలులో మనకు నచ్చిన సీట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. మరో సమయంలో బుకింగ్ విఫలం కావచ్చు. అప్పుడు టికెట్‌ను పొందకుండానే మన డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. ఇక ఆ రుసుం తిరిగి వచ్చే విధానం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం పడుతుంది.
అయితే ఈ సమస్యలన్నింటికీ సమాధానంగా ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్), 'ఐపే ఆటోపే'(IRCTC iPay Autopay) అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఛార్జీ చెల్లించకుండానే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కన్ఫామ్ అయిన తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. తద్వారా టికెట్ బుక్ కాని పరిస్థితుల్లో మనం డబ్బులు కోల్పోయే పరిస్థితి ఉండదు. మరి ఆ ఫీచర్ ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
'ఐపే ఆటోపే' అంటే ఏమిటి?
'ఐపే ఆటోపే' అనేది ఒక పేమెంట్ ఆప్షన్. ఇది ఐఆర్‌సీటీసీ వెబ్సైట్, యాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ సొంత పేమెంట్ గేట్‌వే అయిన ఈ iPay, యూపీఐ, క్రెడిట్/ డెబిట్ కార్డ్స్, ఐఆర్‌సీటీసీ ముద్ర, నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ పేమెంట్ విధానాలతో టికెట్ డబ్బులు చెల్లించే అవకాశం కల్పిస్తోంది.
iPay ఎలా పనిచేస్తుంది?
iPay పేమెంట్ గేట్‌వేకు ఉన్న ప్రత్యేక ఫీచర్ ఆటోపే. దీని ద్వారా ఎక్కువ విలువ కలిగిన లేదా వెయిట్ లిస్ట్‌లో ఉన్న టికెట్లను బుక్ చేయొచ్చు. మీరు టికెట్లు బుక్ చేసినప్పుడు ఈ 'ఆటోపే' ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. అయితే, టికెట్ బుక్ చేసినా మన ఖాతాలో నుంచి డబ్బులు బదిలీ అవ్వవు. మన బ్యాంక్ ఖాతాలో ఉన్న టికెట్ ఛార్జీ మొత్తంపై లైయెన్ (lien- మీ అకౌంట్లోని డబ్బు వేరే చోట ఖర్చు చేయకుండా నియంత్రణ) విధిస్తుంది. మన టికెట్ కన్ఫామ్ కాకపోయినా, క్యాన్సిల్ అయినా మన డబ్బులపై ఉన్న నియంత్రణ తొలగిపోతుంది.
ఈ సందర్భాల్లో ఉపయోగపడుతుంది
- వెయిట్ లిస్ట్ (IRCTC Waitlist) : మీరు వెయిట్‌లిస్ట్‌లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు, అది కన్ఫామ్ కాకపోతే మీ డబ్బులు కట్ అవ్వవు. ఆటోపే నియంత్రణ తొలగిపోవడం వల్ల మీరు మీ డబ్బులను ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
- వెయిట్ లిస్ట్ తత్కాల్ (IRCTC Waitlist Tatkal) : తత్కాల్ కోటాలో వెయిల్లిస్ట్లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు, ఒకవేళ అది కన్ఫామ్ కాకపోతే, మీరు కేవలం క్యాన్సలేషన్ ఫీజు, ఐఆర్‌సీటీసీ కన్వీనియెన్స్ ఫీజు, మాండేట్ ఛార్జీలు వంటివి కట్టాల్సి ఉంటుంది. మిగతా డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది.
- ఇన్స్టంట్ రిఫండ్ (IRCTC Instant refund) : వెయిట్‌లిస్ట్‌లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు అవి కన్ఫామ్ కాకపోతే మన డబ్బులు వెంటనే రిఫండ్ అవుతాయి. దీనికోసం మనం 3-4 రోజులు వేచిచూడాల్సిన అవసరం లేదు.
'ఆటోపే' ఇలా చేయండి
- ఐఆర్‌సీటీసీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి, మీ ప్రయాణ వివరాలను నమోదు చేయాలి.
- అందులో మీ రైలు, కోచ్, ప్రయాణికుల వివరాలను నమోదు చేయాలి.
- ఆ తర్వాత పేమెంట్ బటన్‌పై క్లిక్ చేసి iPayను పేమెంట్ గేట్‌వేలా సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం Autopay, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐఆర్‌సీటీసీ ముద్ర, నెట్‌బ్యాంకింగ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- Autopay ఆప్షన్‌తో పాటు పేమెంట్ విధానం (యూపీఐ, డెబిట్/ క్రెడిట్ కార్డ్) ఎంపిక చేయాలి.
- పేమెంట్ వివరాలు నమోదు చేస్తే మీ లావాదేవీ పూర్తవుతుంది. వెంటనే మీ బ్యాంకు, టికెట్ డబ్బులపై నియంత్రణ విధిస్తుంది. టికెట్ బుక్ కాగానే మన ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి.
ట్రైన్ జర్నీలో ఇబ్బందులా? ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఒక్క కాల్ చేస్తే వెంటనే పరిష్కారం!
టికెట్ బుకింగ్‌కు ఈమెయిల్, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ మస్ట్!- IRCTC కొత్త అప్డేట్