BTS క్రేజ్ అట్లుంటది మరి! వెబ్ సిరీస్‌లు చూసి 1000మందికి కొరియా భాష నేర్పిన మహిళ- వారికి ఉద్యోగాలు కూడా! - Korean Language Learning - KOREAN LANGUAGE LEARNING
Tamil Woman Teaching Korean Language : BTS- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని యూత్ ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా వరల్డ్‌వైడ్‌గా ఫేమస్ అయిన బీటీఎస్‌కు మన దేశంలోనూ చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు!. దీంతో కొరియన్ సంగీతం, సంస్కృతి, వేషధారణ ప్రభావం మన యూత్‌పై పడింది. అలా కొరియన్ డ్రామాలకు అభిమాని అయిన ఓ మహిళ- కొరియన్ భాష నేర్చుకుంది. తనలా ఆసక్తి కలిగిన దాదాపు 1000మందికి పరాయి భాషను నేర్పించింది. అసలు ఆమె కొరియన్ ఎలా నేర్చుకుంది? కొరియా భాషతో ఉద్యోగావకాశాలు ఉన్నాయా? అనే విషయాలను 'ఈటీవీ భారత్'కు వివరించింది. ఆ విశేషాలు మీకోసం.
Published : Jul 29, 2024, 1:05 PM IST
Tamil Woman Teaching Korean Language : పైన రీల్ చూశారుగా, ప్రతి ఇంట్లో దాదాపు ఇదే పరిస్థితి. మరీ ముఖ్యంగా 15-25 ఏళ్ల మధ్య వయసున్నవారు ఉంటే ఇక చెప్పనక్కర్లేదు! కొరియన్ సినిమాలు, డ్రామాలు, సంగీతం, కల్చర్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు మన యూత్. కొరియన్ డ్రామాలు, కే-పాక్ ప్రభావంతో యువత- అక్కడి సెలబ్రిటీల హావభావాలు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కొరియా BTS మ్యూజిక్ గ్రూప్ కే-పాప్‌లో సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా టీనేజ్ యువత విపరీతంగా ఆకర్షితులయ్యేలా చేసింది. మన దేశంలోనూ బీటీఎస్‌కు డైహార్డ్ ఫాన్య్ చాలా మందే ఉన్నారు. మ్యూజిక్ మాత్రమే కాకుండా, ఓటీటీ పుణ్యమా అని కొరియన్ డ్రామాలు కూడా ఎక్కువగానే చూస్తున్నారు మనోళ్లు. అలా టీనేజీ, జెన్-జీ యువత కొరియన్ సెలబ్రిటీలలాగా డ్రెస్సింగ్ స్టైల్, హావభావాలు సైతం ప్రదర్శిస్తున్నారు. మన యూత్ ఇంటా, బయట అదే ధ్యాసలో ఉంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల మరో అడుగు ముందుకేసి కొరియన్ భాష నేర్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అలా కొరియన్ డ్రామాలు, సినిమాలకు అభిమానై కొరియన్ భాష నేర్చుకుంది ఓ మహిళ. తనలా కొరియన్ భాషపై ఆసక్తి ఉన్న 1000మందికి నేర్పించింది. కొరియన్ భాష నేర్చుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా ఉన్నాయని చెబుతోంది.
కొరియన్ డ్రామాలు, కే-పాప్ ప్రభావం తమిళనాడుపై కూడా పడింది. చెన్నై సమీపంలోని అంబత్తూర్‌కు చెందిన జయశ్రీకి కొన్నేళ్ల క్రితం కొరియన్ భాషపై ఆసక్తి ఏర్పడింది. అప్పట్లో తమిళంలో అనువాదం అయిన కొరియన్ డ్రామాలు చూసేది జయశ్రీ. క్రమంగా కొరియన్ భాష నేర్చుకుని సర్టిఫికెట్ కూడా తీసుకుంది. అనంతరం తనలా కొరియన్ భాషపై ఆసక్తి ఉన్నవారికి నేర్పించడం మొదలు పెట్టింది. తొలుత ఆఫ్‌లైన్ క్లాసులు చెప్పడానికి పరిమితమైన జయశ్రీ, ఆ తర్వాత ఆన్‌లైన్‌లోనూ కొరియన్ భాష గురించి తరగతులు నిర్వహిస్తోంది. గత ఐదేళ్లుగా తాను ఔత్సాహికులకు కొరియన్ భాష బోధిస్తున్నట్లు జయశ్రీ తెలిపింది.
'కొరియన్ గ్రామర్ సింపుల్!'
అన్ని భాషల లాగే కొరియన్ భాష నేర్చుకోవడంలో కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయని జయశ్రీ చెప్పింది. ప్రతి స్థాయికి కొరియన్ ప్రభుత్వం వేర్వేరు ధ్రువపత్రాలు ఇస్తుందని తెలిపింది. 'వివిధ రకాల అవసరాలకు కొరియన్ భాష నేర్చుకుంటారు. చాలా మంది పాఠశాల విద్యార్థులు కొరియన్ సిరీస్, సినిమాలు చూడటం కోసం నేర్చుకుంటారు. మరికొందరు ఉన్నత విద్య కోసం, కొరియాలో పని చేసేందుకు నేర్చుకుంటారు. కొరియన్ సినిమాలు, డ్రామాలు చూసి బేసిక్స్ నేర్చుకున్న వారికి మిగతా లెవెల్స్‌లో శిక్షణ ఇస్తాను. భారత్‌లోని ఏ భాష అయినా తెలిస్తే, వారికి కొరియన్ నేర్పించడం సులభం అవుతుంది. కొరియన్ వ్యాకరణం కూడా సులువుగా ఉంటుంది' అని జయశ్రీ తెలిపింది.
కొరియన్ భాష నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు!
కొరియన్ భాష నేర్చుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు కూడా ఉన్నట్లు జయశ్రీ తెలిపింది. 'ఇతర భాషలు నేర్చుకునే వారికి లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించినట్టే- కొరియన్‌కు కూడా కొరియా ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షను దిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ పరీక్ష పూర్తి చేసిన తర్వాత కొరియా ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికెట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సర్టిఫికెట్‌తో కొరియన్ కంపెనీల్లో, అంతర్జాతీయ సంస్థల్లో ట్రాన్స్‌లేటర్లుగా, ట్రైనర్లుగా ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి' అని జయశ్రీ వివరించింది.
కొరియన్, తమిళ మధ్య సిమిలారిటీ
కొరియన్, తమిళం భాషలకు చాలా సారూప్యత ఉంది. కొరియన్ భాషలో దాదాపు వెయ్యి పదాలు తమిళ పదాలను పోలి ఉంటాయి. ఇక కొన్ని పదాలు అర్థంలో, ఉచ్ఛారణలో సమానంగా ఉంటాయి. కొరియా రాజు కిమ్ సురే తమిళనాడుకు చెందిన సూరిరత్న అనే మహిళను వివాహం చేసుకున్నాడని, ఆ మహిళ యువరాణే హియో అని చారిత్రక రికార్డులు చెబుతున్నాయని అంటారు. ఈ భాషను 14వ శతాబ్దంలో కొరియన్ రాజే సృష్టించాడని చెబుతారు.