IMD Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ- ఐఎండీ ప్రకటించింది. మాల్దీవులు సహా నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ ప్రాంతాలను ఆదివారం తాకాయని వెల్లడించింది. మే 31వ తేదీకి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు మరోసారి అంచనా వేసింది.
భారత వాతవరణ శాఖ ప్రకారం, కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. మొదటిసారి ముందుగా 1918లో మే 11నే ప్రవేశించాయి. అత్యంత ఆలస్యంగా 1972 జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి.
అయితే ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని ఇటీవల ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.
వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు-సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది.
2024లో సాధారణ స్థాయిలోనే వర్షాలు!
మరోవైపు దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ ఇటీవలే అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలకు దీర్ఘ కాల సగటు 868.6 మిమీలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని చెప్పింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.