Cauliflower Pakoda Making Process : చాలా మందికి సాయంత్రమైతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. బజ్జీలు, పకోడీలు, గారెలు, ఫాస్ట్‌ఫుడ్ అంటూ నచ్చినవి లాగించేస్తారు. ఎప్పుడో ఒకసారి బయట కొనుక్కుంటే ఎటువంటి సమస్య ఉండదు. కానీ, అలాకాకుండా ప్రతిరోజూ కొనుక్కుంటే మాత్రం డబ్బులు ఖర్చువడంతో పాటు జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి, అలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో చేసుకోవడమే బెటర్. అలాగని ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ చేస్తే తినలేరు.
అందుకే మీకోసం ఈరోజు సూపర్ టేస్టీ కాలీఫ్లవర్ పకోడి తీసుకొచ్చాం. అయితే, చాలా మంది కాలీఫ్లవర్‌తో మంచూరియా మాత్రమే చేసుకుంటారని అనుకుంటారు. కానీ, దీనితో పకోడి కూడా చేసుకోవచ్చు. అవి చాలా క్రిస్పీగా ఉండటంతో పాటు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ట్రై చేయండి!
కాలీఫ్లవర్ పకోడీకి కావాల్సిన పదార్థాలు:
- కాలీఫ్లవర్- ఒకటి
- శనగపిండి- అర కప్పు
- బియ్యపుపిండి-పావు కప్పు
- మొక్కజొన్న పిండి - పావు కప్పు
- ఉప్పు- తగినంత
- కారం- రెండు చెంచాలు
- ఆరెంజ్ ఫుడ్ కలర్- చిటికెడు
- ఉల్లిపాయలు- ఒకటి (సన్నగా కోసుకోవాలి)
- పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరుక్కోవాలి)
- అల్లంవెల్లుల్లి పేస్ట్- చెంచా
- కరివేపాకు - 2 రెబ్బలు(సన్నగా కట్ చేసుకోవాలి)
- నూనె- తగినంత.
మర్గ్ మలై టిక్కా - సూపర్ టేస్టీ - చేయడం కూడా ఈజీనే!
తయారీ విధానం:
- ముందుగా కాలీఫ్లవర్‌ను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు గ్యాస్ మీద బాండీ పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు కాస్తంత ఉప్పు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి మూత పెట్టి రెండు, మూడు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. తర్వాత ఆ ముక్కలను నీటి నుంచి బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.
- మరో గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కరివేపాకు కొన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కలను వేసి పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
- అనంతరం స్టవ్‌పై కడాయి పెట్టి నూనె పోసి అది మరిగాక కాలీఫ్లవర్ ముక్కలను వేసి మీడియం మంటపై డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే క్రిస్పీ అండ్ టేస్టీ కాలీఫ్లవర్ పకోడి రెడీ! వీటిని టమాట సాస్‌తో కలిపి వేడి వేడిగా తింటే సూపర్‌గా ఉంటాయి.
ప్రయోజనాలు చూస్తే.. కాలీఫ్లవర్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ C, K, B6, ఫోలేట్ అలాగే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇక కాలీఫ్లవర్‌లోని పోషకాలు క్యాన్సర్‌ను నివారించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడానికి సాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే! - Ginger Pepper Chicken Recipe
తందూరి చికెన్ రోల్స్ ట్రై చేస్తారా? - ఇంట్లోనే యమ్మీ యమ్మీగా లాంగిచేస్తారు!