How to Prepare Mutton Keema in Telugu: వీకెండ్లో చాలా మంది మటన్ కర్రీని ఆరగిస్తుంటారు. లేదంటే బిర్యానీ(Biryani), సూప్ లాంటి రెసిపీలు ప్రిపేర్ చేస్తుంటారు. అయితే.. ఎప్పుడైనా మటన్ కీమా తయారు చేశారా? అది కూడా దాబా స్టైల్లో! లేదు అంటే మాత్రం.. ఇప్పుడు ట్రై చేయండి. అద్భుతహా అనిపించే ఈ రుచిని ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. మరి.. ఇంతకీ ఈ టేస్టీ మటన్ కీమా తయారీకి ఏయే పదార్థాలు కావాలి? ఎలా తయారు చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మటన్ కీమా తయారీకి కావాల్సిన పదార్థాలు :
- మటన్ కీమా- 450గ్రా,
- ఉల్లిపాయలు - మూడు(తరిగినవి)
- పచ్చిమిర్చి - మూడు,
- టమాటా ప్యూరీ- కప్పు,
- నూనె- కావాల్సినంత,
- బిర్యానీఆకులు - రెండు,
- యాలకులు- నాలుగు,
- లవంగాలు- ఐదు,
- జీలకర్ర- చెంచా,
- కారం- రుచికి సరిపడా,
- ఉప్పు- రుచికి తగినంత,
- పసుపు- అరచెంచా,
- ధనియాలపొడి- రెండు చెంచాలు,
- జీలకర్రపొడి - పావుచెంచా,
- వెల్లుల్లిపేస్ట్- రెండు చెంచాలు,
- అల్లంపేస్ట్- చెంచా,
- పాలు- నాలుగు చెంచాలు,
- పంచదార- చెంచా,
- ఇంగువ - కొద్దిగా,
- నిమ్మకాయం - సగం ముక్క,
- కొత్తిమీర- కొద్దిగా తీసుకోవాలి.
Mutton Keema Preparation Process:
మటన్ కీమా తయారీ విధానం..
ముందుగా మీరు మటన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో తగినంత నూనె పోసి, కాస్త వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు, జీలకర్ర, లవంగాలు, యాలకులు వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత వాటి నుంచి చక్కని సువాసన వస్తున్నప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
ఆ తర్వాత.. అల్లం, వెల్లుల్లి పేస్ట్, బటర్ వేసుకొని దాన్ని అడుగంటకుండా ఎప్పటికప్పుడూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మసాలాలు వేసుకోవాలి. అయితే.. అలా వేయడానికి ముందు ఆ మిశ్రమం మాడిపోకుండా ఉండేందుకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు అరచెంచా పసుపు, రుచికి సరిపడా కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఇంగువ, ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కీమా వేసుకోవాలి. అది వేగాక.. దానికి పాలు యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అనంతరం టమాటా గుజ్జు, పంచదార, నిమ్మరసం వేసి మరో పది నిమిషాలపాటు సన్నమంట మీద ఉడికించాలి.
అలాగే అడుగంటకుండా మధ్యలో కలుపుతూ కప్పు నీళ్లుపోసి మూతపెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, బట్టర్, పచ్చిమిర్చి వేసి దించేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా సిద్ధం. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి.. పిల్లలు మళ్లీ మళ్లీ కావాలంటారు.
How to Prepare Methi Mutton Curry : మటన్ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!
మీరు నాన్ వెజ్ తినరా? ప్రొటీన్స్ కోసం ఏం తీసుకోవాలో తెలుసా?