MASALA EGG BHURJI MAKING PROCESS : ఎగ్‌తో రకరకాల రెసిపీలు తయారు చేస్తుంటారు. కానీ.. ఎగ్ బుర్జీ స్పెషాలిటీయే వేరు. మీ భోజనంలో ఎగ్ బుర్జీ ఉందంటే.. ఆ రోజు మీరు అద్దిరిపోయే మీల్ ఎంజాయ్ చేస్తారన్నమాట. దీని సూపర్ టేస్ట్‌ను కాస్త చూసినా సరే.. ఆకలి లేని వాళ్లు కూడా ప్లేట్ పట్టుకొని లైన్లో నిల్చుంటారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఉంటుంది దీని రుచి.
అయితే.. ఇది కేవలం టేస్ట్‌కు సంబంధించిన విషయం కాదు. అంతకు మించిన ఆరోగ్యం కూడా దీని సొంతం క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా దీన్నుంచి లభిస్తుంది. రోజూ గుడ్డు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ గుడ్డును ఇలా ప్లాన్ చేశారంటే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మరి.. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
మసాలా ఎగ్ బుర్జీ తయారీకి కావలసినవి :
కోడి గుడ్లు - నాలుగు
ఉల్లిగడ్డలు - నాలుగు
టమాటాలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
నూనె - తగినంత
పుదీనా
అల్లం వెల్లుల్లి పేస్ట్
కరివేపాకు
గరం మసాలా
ధనియాల పొడి
జీలకర్ర పొడి
పసుపు
మిరియాల పొడి
కస్తూరి మేతి
కొత్తిమీర తరుగు
ఉప్పు
తయారీ విధానం :
- స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేయండి. వేడెక్కిన తర్వాత ముందుగానే తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. వెంటనే పచ్చిమిర్చి కూడా వేసి రెండింటినీ బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారే వరకు దాదాపు ఐదారు నిమిషాలు వేగనివ్వాలి.
- ఆ తర్వాత కరివేపాకు, పుదీనా వేసి కలపండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయండి. కాసేపటి తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా వేయించాలి. ఆనంతరం ఉప్పు, టొమాటా వేసి మిక్స్ చేయాలి.
- ఈ రెసిపీ చేస్తున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలని మరిచిపోవద్దు.
- ఐదారు నిమిషాల తర్వాత గుడ్లు పగలగొట్టి అందులో వేయండి. అయితే.. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. గుడ్లు వేయగానే వెంటనే కలపకూడదు. ఓ 2 నిమిషాలు అలా వదిలేయండి. వెంటనే తిప్పితే నీచువాసన వచ్చే అవకాశం ఉంటుంది.
- రెండు నిమిషాల తర్వాత కలిపి.. ఓ 5 నిమిషాలపాటు వేగనివ్వండి. ఆ తర్వాత కొత్తిమీర, కస్తూరి మేతి వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. అద్దిరిపోయే మసాలా ఎగ్ బుర్జీ మీ ముందు నోరూరిస్తూ ఉంటుంది.
- దీన్ని అన్నంలో అయినా, చపాతీలో అయినా సూపర్ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సండే ఈ స్పెషల్ రెసిపీని ఓ పట్టు పట్టండి.