How to Make Mango Bobbatlu : ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. ఇక చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మామిడిపండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. వాటితో జ్యూసులు, లస్సీలు, ఫుడ్డింగ్ అంటూ రకరకాలుగా చేసుకుని తింటుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా తియ్యటి మామిడి పండ్లతో ఒకసారి బొబ్బట్లు చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవి చేసినా కూడా సూపర్ అంటారు. అంతేకాదు వీటిని చేయడం కూడా చాలానే ఈజీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
మామిడి బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు:
- మామిడి పండు - 1
- గోధుమ పిండి లేదా మైదా - 1 కప్పు
- నెయ్యి - తగినంత
- ఉప్పు - రుచికి సరిపడా
- పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
- బెల్లం తురుము - పావు కప్పు
- యాలకుల పొడి - 1 టీస్పూన్
చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా..
తయారీ విధానం:
- ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టి కొద్దిసేపు పక్కకి పెట్టాలి.
- ఇప్పుడు మామిడిపండును చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఓ రెండు చెంచాల నెయ్యి వేసి పచ్చికొబ్బరి తురుము వేసుకోవాలి.
- చిన్న మంట మీద రంగు మారే వరకు వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులోనే బెల్లం తురుము వేసుకుని కలుపుకోవాలి.
- ఆ తర్వాత మామిడి పండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి.
- స్టవ్ సిమ్లో పెట్టి ఈ మిశ్రమాన్ని వేయించుకోవాలి. మామిడి గుజ్జు మొత్తం దగ్గరగా అంటే హల్వా లాగా దగ్గరగా పాన్కు అట్టుకోకుండా ఉండేలా చేసుకోవాలి.
- ఆ సమయంలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకుని ఓ రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- మామిడి పండు మిశ్రమం చల్లారని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతీ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ పిండి ముద్దను తీసుకుని కొంత మేర పూరీల్లా ఒత్తుకుని మధ్యలో ఈ మామిడిపండు పూర్ణాలను పెట్టి పిండి మొత్తాన్ని దగ్గరగా మడచి.. పూరీ కర్ర లేదా చేత్తో పల్చగా బొబ్బట్లుగా ఒత్తుకోవాలి. అయితే ఇలా ఒత్తుకునే సమయంలో మామిడి పండు మిశ్రమం బయటకు రాకుండా చూసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బొబ్బట్లు వేసి నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అవుతాయి.