Why Congress Lost The Elections : హరియాణాలో కాంగ్రెస్ పార్టీ చేతికి అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను సీట్లుగా మార్చుకోవడంలో విఫలమైంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీని సాధించలేక చతికిలబడిపోయింది. అలాగే జమ్ముకశ్మీర్‌లో కూడా కాంగ్రెస్ ఆశించినర మేర ఫలితాలు సాధించలేకపోయింది. అందుకు గల కారణాలేంటి? కాంగ్రెస్‌ను దెబ్బతీసిన అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చీలిన ఓట్లు- లాభపడిన బీజేపీ
తొలుత హరియాణాలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాలని భావించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను ఆప్ 9 స్థానాలు అడగ్గా, అందుకు హస్తం పార్టీ తిరస్కరించింది. దీంతో ఆప్ ఒంటిరిగానే పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చింది. ఒకటిన్నర శాతానికి పైగా ఓట్లను ఆప్ ఈ ఎన్నికల్లో సాధించింది. దీంతో బీజేపీ లాభపడింది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల అంతరం 1శాతం లోపే. ఒకవేళ కాంగ్రెస్, ఆప్ పొత్తుతో బరిలో దిగి ఉంటే ఫలితాలు హస్తం పార్టీకి అనుకూలంగా ఉండేవని వాదనలు వినిపిస్తున్నాయి.
అంతర్గత విభేదాలు
హరియాణా కాంగ్రెస్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందు నుంచే అంతర్గత పోరు ఉంది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా, మరో నేత భూపీందర్ హుడ్డా మధ్య విభేదాలు నెలకొన్నాయి. వీటిని అరికట్టడంలో హస్తం పార్టీ అధిష్ఠానం విఫలమైంది. దీంతో సెల్జా, హుడ్డా మధ్య కోల్డ్ వార్ నడిచింది. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందే సెల్జా కుమారి అలకబూనారు. అలాగే ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. ఇలాంటి విషయాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయి.
జమ్ముకశ్మీర్‌లోనూ హస్తం పార్టీ డీలా!
జమ్ముకశ్మీర్‌లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయింది. భారత్ జోడో యాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీకి జమ్ముకశ్మీర్ ప్రజల ఇచ్చిన మద్దతును కొనసాగించడంలో విఫలమైంది. అలాగే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ సైతం జమ్ముకశ్మీర్‌లో ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. ఇలా కాంగ్రెస్ తప్పులమీద తప్పులచేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ అండతో అరకొరగా ఆరు సీట్లను గెలుచుకుంది.