Hathras Stampede Incident : ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటన తర్వాత పరారీలో ఉన్న భోలే బాబాను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మెయిన్‌పురిలో బాబాకు చెందిన ఆశ్రమంలో సోదాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు బలగాలను అక్కడే మోహరించినా, ఇంతవరకు బాబా ఆచూకీ లభ్యం కాలేదు. ఇదిలా ఉండగా ఈ దుర్ఘటనపై బుధవారం తొలిసారిగా భోలే బాబా స్పందించాడు. దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపాడు.
దొరకని బాబా ఆచూకీ
మెయిన్‌పురిలో భోలే బాబాకు చెందిన నరామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో బుధవారం సోదాలు చేశామని, అక్కడే ఆయన కోసం పోలీసుల బలగాలను మోహరించామని డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. 'ఆశ్రమంలో 40-50 మంది బాబా అనుచరులు ఉన్నారు. అతడి కోసం వెతికినా ఎక్కడ కనిపించలేదు. ఇప్పటి వరకు బాబా ఆచూకీ గురించి తెలియదు' అని తెలిపారు.
'దర్యాప్తునకు సహకరిస్తా'
మరోవైపు హాథ్రస్ తొక్కిలాసట జరిగిన ఒకరోజు తర్వాత భోలే బాబా స్పందించాడు. వేదిక నుంచి తాను వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఈ ఘటన జరిగిందని తెలిపాడు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నాడు. ఈ దుర్ఘటన వెనక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపించాడు. ఈ మేరకు అతని తరఫు న్యాయవాది బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే భక్తులను అతడి భద్రత సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నట్లు సమాచారం.
ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్
యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆదేశాల మేరకు హాథ్రస్ ఘటనపై దర్యాప్తునకు బుధవారం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయకమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారులు హేమంత్ రావు, భవేశ్ కుమార్ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిషన్ రెండు నెలల వ్యవధిలోపు ప్రభుత్వానికి తన దర్యాప్తు నివేదికను సమర్పిస్తుంది.
'బాబా చాలా మంచోడు'
ఈ దుర్ఘటన తర్వాత కూడా భోలే బాబా చాలా మంచివాడని స్థానికులు అంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి విరాళాలు అడగలేదని, భక్తుల నుంచి వచ్చిన వాటితోనే బాబా భవ్య ధామ్ నిర్మించారని తెలిపారు. ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలు తప్ప మిగతా విషయాలు ఏమి మాట్లాడేవారు కాదని అన్నారు. బాబాకు పిల్లలు లేకపోతే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నాడని, 16-17 సంవత్సరాల క్రితమే ఆమె చనిపోయిందని స్థానికులు పేర్కొన్నారు. ఆమె తిరిగి బతికి వస్తుందనే ఆశతో అప్పడు ఆ అమ్మాయి మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచారని తెలిపారు.
అసోంలో వరద బీభత్సం- 56కు చేరిన మృతుల సంఖ్య- నిరాశ్రయులైన 16లక్షల మంది - ASSAM FLOODS 2024
రాహుల్ గాంధీ ఇంటి వద్ద హై సెక్యూరిటీ- నిఘా వర్గాల హెచ్చరికతోనే!