Doctor Cheated By Cyber Frausters : ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను రోజుకో రకంగా మోసం చేస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకుని పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారులుగా నటిస్తూ కొందరు కేటుగాళ్లు, డాక్టర్ రుచికా టాండన్ నుంచి డిజిటల్ 'అరెస్ట్' పేరుతో రూ.2.8 కోట్లు కాజేశారు.
స్కామ్ ఎలా జరిగింది?
వారం రోజుల క్రితం డాక్టర్ టాండన్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె సిమ్ కార్డ్‌పై 22 ఫిర్యాదులు ఉన్నాయని, నంబర్‌ను బ్లాక్ చేస్తానని కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడు. అనంతరం ఐపీఎస్, సీబీఐ అధికారి అని ఇద్దరితో మాట్లాడించాడు. సీబీఐ అధికారిగా నటిస్తున్న వ్యక్తికి కాల్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఈ నకిలీ సీబీఐ అధికారి, ఆమె డిజిటల్ అరెస్టు అయిందని, జెట్ ఎయిర్‌వేస్ యజమాని నరేష్ గోయల్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమెను ఇరికిస్తానని బెదిరించాడు.
డిజిటల్ అరెస్ట్ పేరిట మోసం
ఆగస్టు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, డాక్టర్ టాండన్‌ను డిజిటల్ అరెస్ట్‌లో ఉంచారు. ఆ సమయంలో మోసగాళ్లు మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలతో బెదిరించారు. ఆ తర్వాత చర్యలు తీసుకోకుండా ఉండేందుకు డబ్బు డిమాండ్ చేశారు. ఆ రెండు రోజుల్లో రూ.2.8 కోట్లను ఏడు వేర్వేరు అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
నేరగాళ్ల నుంచి విముక్తి పొందిన తర్వాత డాక్టర్ టాండన్, లఖ్‌నవూలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, మోసగాళ్లు ఉపయోగించిన అకౌంట్‌లను సీజ్ చేశారు. అయితే డబ్బులు అప్పటికే మరో అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సైబర్ పోలీసులు కేసును విచారిస్తున్నామని, త్వరలోనే మోసగాళ్లను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
బాధితురాలు ఏం చెప్పిందంటే?
ఘటనపై సైబర్ క్రైమ్ బాధితురాలు టాండన్ మాట్లాడారు. "ఉదయం నాకు కాల్ వచ్చింది. కాలర్ తాను TRAI అధికారినని చెప్పాడు. పోలీసుల సూచనల మేరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని చెప్పాడు. ఎందుకంటే ముంబయి సైబర్ క్రైమ్ సెల్‌లో అనేక ఫిర్యాదులు నమోదయ్యాయని, ప్రజలకు వేధించే మెసేజ్‌లు పంపారని చెప్పాడు. రూ.7 కోట్ల మనీలాండరింగ్ కేసులో నా బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందని తెలిపాడు. అనంతరం ఐపీఎస్ అధికారిగా చెబుతూ మరొకరితో మాట్లాడేలా చేశాడు. నన్ను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు వచ్చాయని మరో వ్యక్తి చెప్పాడు. నేను వారి వద్దకు వెళ్లలేకపోతే, నన్ను 'డిజిటల్ కస్టడీ'లోకి తీసుకుంటామని తెలిపారు. తర్వాత సీబీఐ అధికారి అని మరొకరితో మాట్లాడించారు. ఈ విషయం జాతీయ భద్రతకు సంబంధించిందని, దీని గురించి ఎవరితో మాట్లాడవద్దని చెప్పారు" అని తెలిపారు.
డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు!
లఖ్‌నవూ సైబర్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గులామ్ మాట్లాడారు. "మనం చట్టం కోణం నుంచి మాట్లాడితే, 'డిజిటల్ అరెస్ట్' అనే పదం లేదు. కానీ సైబర్ నేరగాళ్లు ఈ రోజుల్లో ఇలాంటి పదాలు వినియోగించి, ప్రజలను భయపెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు యూనిఫామ్‌లో స్కైప్‌లో మాట్లాడుతారు. అయినా ముఖం కనిపించకుండా జాగ్రత్త పడతారు. ఎందుకని ప్రశ్నిస్తే ఐడెంటిటీ రివీల్ చేయలేమంటారు. బాధితుల నుంచి అన్ని వివరాలు తీసుకుని, అరెస్టులో ఉంచామని, ఎవరితోనూ మాట్లాడకూడదని చెబుతారు" అని వివరించారు.