Central Reply To Mamata Banerjee Letter : బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్రం మహిళలపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడానికి ఉన్న చట్టాలు సరిపోతాయని, వాటిని కఠినంగా అమలు చేస్తే చాలని కౌంటర్ ఇచ్చింది. మహిళలపై లైంగిక దాడులు, పోక్సో కేసులను విచారణ వేగవంతం చేసే ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులను బంగాల్ ప్రభుత్వం ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి రిప్లై ఇచ్చారు.
''బంగాల్‌లో 48,600 రేప్, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విచారణ కోసం రాష్ట్రానికి అదనంగా మరో 11 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల అవసరం ఉంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులను పరిష్కరించేందుకు పూర్తిస్థాయిలో ఎఫ్‌టీఎస్‌సీలు లేవు. మీ లేఖలో ఉన్న సమాచారంలో కొన్ని తప్పులు ఉన్నాయి. అంతేకాకుండా ఎఫ్టీఎఫ్సీల ఏర్పాటులో జరిగిన జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఇక అత్యాచారం, పోక్సో కేసుల విచారణ కోసం ఎఫ్టీఎఫ్సీల్లో ప్రత్యేక జ్యుడీషియల్ ఆఫీసర్లు, ఏడుగురు సిబ్బంది నియమించాలని మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే సిబ్బంది కొరత ఉన్న సమయాల్లో ఆయా రాష్ట్రాలు, యూటీలు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకునే వెసులుబాటు ఉంది. ఈ విషయాన్ని ఇంతకుముందే బంగాల్ ప్రభుత్వానికి తెలియజేశాం'' అని కేంద్ర మంత్రి తెలిపారు.
భారతీయ న్యాయ సంహిత (BNS)లో ఇప్పటికే అత్యాచారం/హత్యాచారానికి సంబంధించిన కఠినమైన శిక్షలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింస, నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు సమగ్రంగా, కఠినంగా ఉన్నాయని దేవి పునర్ఘాటించారు. చట్టాల ప్రకారం నిర్దేశించిన సమయంలో కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
'అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష!'
దేశంలో మహిళల భద్రత కోసం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆలోచిస్తుందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. ''అత్యాచారం వంటి నేరాలకు మరణశిక్ష విధించేలా చట్టాలను సవరించాం. ఆ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలు చూస్తుంటే, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. మహిళలపై జరుగుతున్న నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఆ దిశగా కొన్ని రాష్ట్రాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన ఘటన అమానవీయమైనది'' అని మంత్రి పోస్టు పెట్టారు.