Firing On Rape Victim : తనపై పెట్టిన రేప్ కేసు వెనక్కి తీసుకోవడం లేదన్న కోపంతో బాధితురాలిపై దారుణంగా దాడి చేశాడు ఓ నిందితుడు. తన స్నేహితులతో కలిసి బాధితురాలు, ఆమె సోదరుడిపై తుపాకీ, పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రైలు ఢీకొని కాలును పోగొట్టుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
రాజేంద్ర యాదవ్ అనే వ్యక్తిపై ఓ యువతి 2023 జూన్‌లో అత్యాచారం కేసు పెట్టింది. నిందితుడు తనను అత్యాచారం చేసి, ఆ ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు, కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానంటూ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించాడు. దీంతో భయపడిన నిందితురాలు, తనకు రక్షణ ఇవ్వాలంటూ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు.
ఈ క్రమంలోనే శనివారం సోదరుడితో కలిసి బైక్‌పై వెళ్తున్న బాధితురాలిని, తన స్నేహితులు మహిపాల్, రాహుల్‌తో కలిసి అడ్డగించాడు రాజేంద్ర. పదునైన ఆయుధాలు, తుపాకీతో వారిపై దాడి చేశారు. బాధితురాలిపై తుపాకీతో కాల్పులు జరిపి, ఆయుధంతో గాయపరిచారు. ఈ దాడిలో బాధితురాలి సోదరుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. బుల్లెట్ గాయాలపాలైన బాధితురాలు, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, బాధితురాలు సహా ఆమె సోదరుడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి జైపుర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసిన వైద్యులు, బాధితురాలి శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆమె సోదరుడు సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తప్పించుకునే ప్రయత్నంలో రైలు ఢీ
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా, అలసత్వం ప్రదర్శించిన ఏఎస్ఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ కేసు దర్యాప్తును ఏఎస్పీకి అప్పగించారు. దాడికి సహకరించిన రాజేంద్ర స్నేహితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకీతో పాటు పదునైన ఆయుధాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజేంద్ర యాదవ్ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రాజేంద్రను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి కాలు తెగిపోయింది. దీంతో అతడిని ట్రామా సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. పోలీసుల భద్రత నడుమ అతడికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.
కాంగ్రెస్ ఫైర్- నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు
మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందని ఆరోపించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. నలుగురు సభ్యులతో నిజనిర్ధరణ కమిటీని నియమించింది. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని కలిసి నివేదికను అందిస్తోందని పేర్కొంది.
వృద్ధురాలి కాళ్లు, చేతులు నరికి హత్య
ఓ వృద్ధురాలి కాళ్లు, చేతులు నరికి దారుణంగా హత్య చేశారు దుండగులు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ డ్రమ్ములో పెట్టి పారిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం జరిగింది. అయితే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోందని, డబ్బుల కోసమే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, దినేశ్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బామ్మకు పాముకాటు వేయించి హత్య- రూ.కోటి బీమా సొమ్ము కోసం మనవడి దారుణం- చివరకు!
ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం భర్త పట్టు- రక్తస్రావంతో గర్భిణి, శిశువు మృతి