Highest Times Budget Presented Ministers : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టి ఇప్పటికే రికార్డు నెలకొల్పిన నిర్మలమ్మ, ఇప్పుడు ఏడోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది.
అయితే మన దేశంలో అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డును సృష్టించారు. 1959 నుంచి 1963 మధ్య, 1967 నుంచి 1969 మధ్యకాలంలో ఆయన కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా చిదంబరం తొమ్మిదిసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 సంవత్సరం నుంచి వరుసగా కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. మరి 1947 నుంచి 2024 వరకు బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రులు ఎవరు? ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు?
ఆర్థిక మంత్రి పేరు | బడ్జెట్ల సంఖ్య |
మొరార్జీ దేశాయ్ | 10 |
పి. చిదంబరం | 9 |
ప్రణబ్ ముఖర్జీ | 8 |
సీడీ దేశ్‌ముఖ్ | 7 |
యశ్వంత్ సిన్హా | 7 |
నిర్మలా సీతారామన్ | 6 |
మన్మోహన్ సింగ్ | 6 |
వైబీ చవాన్ | 5 |
అరుణ్ జైట్లీ | 5 |
టీటీ కృష్ణమాచారి | 4 |
ఆర్.వెంకట్రామన్ | 3 |
హెచ్‌ఎం పటేల్ | 3 |
సి. సుబ్రమణ్యం | 2 |
వీపీ సింగ్ | 2 |
జశ్వంత్ సింగ్ | 2 |
ఆర్‌కే షణ్ముఖం శెట్టి | 2 |
జాన్ మథాయ్ | 2 |
జవహర్‌లాల్ నెహ్రూ | 1 |
సచీంద్ర చౌధరీ | 1 |
ఇందిరా గాంధీ | 1 |
చరణ్ సింగ్ | 1 |
ఎన్డీ తివారీ | 1 |
ఎస్‌బీ చవాన్ | 1 |
మధు దండావతే | 1 |
పీయూష్ గోయల్ | 1 |
జులై 23న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్-2024 రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సోమవారం ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగుతాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి ఒకరోజు ముందే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటు ముందు ఉంచనున్నారు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై కేంద్ర సర్కారును ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని సర్కారు వాటాను 51 శాతం కన్నా దిగువకు తగ్గించుకునే యత్నాలను అడ్డుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇప్పటికే ప్రకటించారు.