Fast Stair Climbing Record In Rajasthan : రాజస్థాన్ జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్ సింగ్ రాఠోడ్ 24గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. స్పెయిన్ చెందిన క్రిస్టియన్ రాబర్టో (70,200 మెట్లు) పేరిట ఉన్న రికార్డును హిమ్మత్ సింగ్ అధిగమించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని యువతకు పంపేందుకు ఈ రికార్డు సృష్టించినట్లు హిమ్మత్ సింగ్ చెప్పుకొచ్చారు.
"వైశాలి నగర్లో హిమ్మత్ సింగ్ 20 అంతస్తుల భవనాన్ని 81సార్లు ఎక్కి, 80సార్లు దిగాను. ఈ భవనంలో మొత్తం 439 మెట్లు ఉన్నాయి. దీంతో మొత్తం 70,679 మెట్లు ఎక్కి రికార్డును నెలకొల్పాను. 2024 మార్చి 23న 19 గంటల్లో 20 కిలోమీటర్ల మెట్లు ఎక్కాను. అప్పుడు ఆసియా బుక్ రికార్డ్‌తో పాటు ఇండియా బుక్ రికార్డ్‌లో చోటు సంపాదించాను. అప్పుడే క్రిస్టియన్ రాబర్టో రికార్డును అధిగమించాలని నిర్ణయించుకున్నాను. జయపురలోని 20 అంతస్తుల భవనంలో సోమవారం(మే 6) సాయంత్రం 5.30 గంటలకు మెట్లు ఎక్కడం ప్రారంభించి, మంగళవారం సాయంత్రం 5.22 గంటలకు పూర్తి చేశాను. ఈ ఫీట్‌ను ప్రభుత్వ పాఠశాలలోని పీఈటీ బృందం పర్యవేక్షించింది"
-హిమ్మత్ సింగ్, మాజీ కమాండో
లక్ష మెట్లు ఎక్కి సరికొత్త రికార్డు సృష్టించాలనుకున్నానని మాజీ కమాండో హిమ్మత్ సింగ్ తెలిపారు. అయితే వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని స్నేహితులు, కుటుంబ సభ్యులు క్రిస్టియన్ రాబర్టో రికార్డును అధిగమించేవరకు మెట్లు ఎక్కేందుకు అనుమతించారని చెప్పారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలనే సందేశాన్ని యువతకు అందించడం కోసమే ఈ రికార్డును సృష్టించానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో 15-16 ఏళ్ల పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటూ జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా ఉంటున్నారని అన్నారు. 32 ఏళ్ల వ్యక్తి రికార్డును 40 ఏళ్ల వయసున్న తాను బద్దలు కొట్టగలిగితే తాము కూడా ఏదైనా చేయగలమని పిల్లల్లో స్ఫూర్తినివ్వడానికే 70వేలకు పైగా మెట్లు ఎక్కానని అన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, వారిని చెడు అలవాట్లకు బానిస కాకుండా కాపాడుకోవాలని హిమ్మత్ సింగ్ సూచించారు.
![Fast Stair Climbing Record In Rajasthan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/21412827_himmata.png)
రూ.500 విలువైన బూట్లు ధరించి
తాను రూ.500 విలువైన బూట్లు ధరించి రికార్డును నెలకొల్పానని చెప్పుకొచ్చారు హిమ్మత్ సింగ్. 70,200 మెట్లు ఎక్కిన క్రిస్టియన్ రాబర్టో రూ.లక్ష కంటే ఎక్కువ విలువైన బూట్లు ధరించారని అన్నారు. 'ఏ పనైనా చేయాలనే తపన ఉండాలేగానీ విజయం తప్పక వరిస్తుంది. కొన్నిసార్లు నచ్చిన పనిచేసినప్పుడు కష్టాలు తప్పవు. నాకు మెట్లు ఎక్కుతుండగా చాలాసార్లు అలసటగా అనిపించింది. అయినా కళ్ల ముందు లక్ష్యం కనిపించింది. కష్టానికి భయపడి సైనికుడు లక్ష్యాన్ని ఎప్పటికీ వదలడు' అని హిమ్మత్ సింగ్ చెప్పుకొచ్చారు.
![Fast Stair Climbing Record In Rajasthan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-05-2024/21415830_fast-stair-climbing-record-in-rajasthan--1.jpg)
'24 గంటల కన్నా ముందే'
క్రిస్టియన్ రాబర్టో రికార్డును హిమ్మత్ సింగ్ 24 గంటల కన్నా ముందే అధిగమించారని పీఈటీ సంతోష్ రాఠోడ్ తెలిపారు. హిమ్మత్ సింగ్ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు మొత్తం కెమెరాలో రికార్డు చేశామని పేర్కొన్నారు. హిమ్మత్ సింగ్ మెట్లు ఎక్కే ఫుటేజీ అంతా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రధాన కార్యాలయానికి పంపుతామని వెల్లడించారు. హిమ్మత్ సింగ్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కుతుందని పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.
40ఏళ్ల తర్వాత రేప్ కేస్ నిందితుడు అరెస్ట్- ఆ టెక్నాలజీతోనే! - Man Arrested After 40 Years