Farmers Union Ministers Talks : దిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని విరమించుకునేలా చర్చలు చేపట్టారు. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ రెండో దఫా చర్చల్లో కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, వ్యయసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, సంయుక్త కిసాన్ మోర్చా- ఎస్కేఎమ్ నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ సహా తదితరులు పాల్గొన్నారు.
ఎస్కేఎమ్ సహా 200కుపైగా రైతు సంఘాలు మంగళవారం (ఫిబ్రవరి 13)న 'దిల్లీ చలో' కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కనీస మద్దతు ధర చట్టం, 60 ఏళ్లు నిండిన రైతులకు ఆర్థిక సాయం సహా పలు డిమాండ్లను పరిష్కరించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమానికి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 8న రైతు ప్రతినిధులతో కేంద్ర మంత్రులు తొలి దఫా చర్చలు జరిపారు.
హైకోర్టులో పిటిషన్
'దిల్లీ చలో' నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దులు మూసివేడం, ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రైతులను అడ్డుకునేందుకు పంజాబ్, హరియాణా, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ కోర్టును కోరారు. అంతేకాకుండా ఆ చర్యలు రైతుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని, అవి రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నారు.
'నిరసనల వల్ల చాలా నష్టపోయాం'
మరోవైపు, దిల్లీ చలో కార్యక్రమం వల్ల దేశ రాజధాని టిక్రీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం రైతుల నిరసనల వల్ల తమ షాపులు మూసేసుకోవాల్సివచ్చిందని, ఈసారి కూడా అలాగే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరిగినా మాకు చాలా నష్టం వస్తుంది. మా షాపులకు రోజూ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు వస్తుంటారు. నిరసనలు జరిగినప్పుడు రోడ్డు మూసేయడం వల్ల వారు ఇక్కడికి రావడానికి ఇబ్బంది ఎదురవుతుంది. వారి ద్వారా వచ్చే ఆదాయమే మాకు జీవనాధారం. రోడ్డుని మూసేస్తే మాకు వచ్చే గిరాకీ రాదు. దీంతో మా జీవనాధారం దెబ్బతింటుంది' అని కృష్ణ కుమార్ అనే వ్యాపారి వాపోయాడు.
భోపాల్‌లో కర్టాటక రైతులు అరెస్ట్
ఆందోళనల్లో పాల్గొనేందుకు దిల్లీకి వెళ్తున్న కర్ణాటక రైతులను భోపాల్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు- జీఆర్పీ సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం దిల్లీ చలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో రైలులో రైతులు నినాదాలు చేశారు. దీంతో వారిని జీఆర్పీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
అయితే రైతులను అరెస్టు చేయడాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 100 మంది రైతులను భోపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టియర్ గ్యాస్ ప్రాక్టీస్
మరోవైపు, దిల్లీలోకి రాకుండా రైతులను ఎక్కడికక్కడే అడ్డుకునేలా పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నిరసనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘించినా వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించేంగుకు డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
ముళ్ల కంచెలతో దిల్లీ సరిహద్దులు మూసివేత
రైతు సంఘాలు 'దిల్లీ చలో'కు పిలుపునివ్వడం వల్ల వారిని అడ్డుకునేందుకు అధికారులు భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే పంజాబ్, హరిణాయాణా సరిహద్దు జిల్లాలైన అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సాలోని అనేక ప్రదేశాలలో కాంక్రీట్ బ్లాక్‌లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలను అమర్చారు. హరియాణాలో మంగళవారం రాత్రి వరకు ఇంటర్నెట్, SMS సేవలపై ఆంక్షలు విధించారు. దిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
పార్లమెంట్ ముట్టడికి రైతుల పిలుపు- దిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్